► పదో షెడ్యూల్ సంస్థలకు నేరుగా ఏపీ సర్కారు లేఖలు
► చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఏపీపై తెలంగాణ ఆగ్రహం
► లేఖలు పట్టించుకోవద్దని అన్ని సంస్థలకూ సీఎస్ సర్క్యులర్
సాక్షి, హైదరాబాద్: పదో షెడ్యూల్ సంస్థల ఆస్తులు ఉమ్మడివని.. వాటిని పంచుకుందామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా సంబంధిత సంస్థల అధిపతులకు లేఖలు రాయడం వివాదాస్పదమవుతోంది. ఏపీ వైఖరిపై తెలంగాణ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ లేఖలను అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం అన్ని సంస్థలకూ ప్రత్యేకంగా సర్క్యులర్ జారీ చేశారు. ఏపీ నుంచి లేఖలు అందుకున్న సంస్థల అధిపతులు వెంటనే తనకు సమాచారం అందించాలని, భవిష్యత్తులోనూ ఏపీ నుంచి ఎటువంటి లేఖలు వచ్చినా తెలియజేయాలని ఆదేశించారు. నేరుగా పదో షెడ్యూల్ సంస్థలకు ఏపీ లేఖలు రాయటం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం నిబంధనలకు పూర్తి విరుద్ధమని సీఎస్ ఇచ్చిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి, లేదా సీఎస్ నుంచి సీఎస్‌కు, లేకపోతే స్టేట్ రీ ఆర్గనైజేషన్(ఎస్‌ఆర్) టు ఎస్‌ఆర్ విభాగానికి సమాచార మార్పిడి జరగాలని, పరిపాలనలో అదే సంప్రదాయం పాటించాలని సూచించారు. ఇదేమీ పట్టించుకోకుండా దాదాపు వంద సంస్థలకు ఏపీ లేఖలు రాయడాన్ని సీఎస్ తప్పుబట్టారు.
పదో షెడ్యూల్‌లో మొత్తం 142 సంస్థలు ఉన్నాయి. వీటిలో 122 తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. 16 ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. నాలుగు సంస్థలు రెండు చోట్లా ఉన్నాయి. షెడ్యూల్ పది సంస్థల వ్యవహారాలన్నీ సంయుక్తంగా నిర్వహించాలని, జనాభా నిష్పత్తి ప్రకారం విభజించాలనేది ఏపీ ప్రభుత్వ వాదన. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం భౌగోళికత ఆధారంగా ఈ సంస్థలన్నీ తమకే చెందుతాయనేది తెలంగాణ ప్రభుత్వ వాదన. అవసరమైతే ఏపీ విజ్ఞప్తి మేరకు ఆ సంస్థల సేవలు మాత్రం వినియోగించుకోవచ్చని చెబుతోంది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని విభజన వివాద పరిష్కారాల కమిటీలో ఈ వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని సంస్థల హెచ్‌వోడీలకు ఏపీ ప్రభుత్వం గత 15 రోజుల నుంచి లేఖలు రాయటం వివాదాస్పదంగా మారింది.
ఏపీ లేఖలతో కొత్త వివాదం
Published Sat, Jun 25 2016 3:06 AM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM
Advertisement