CS rajeev sharma
-
సీఎస్ రేసులో ఆ నలుగురు
⇒ సీఎస్ రేసులో ప్రదీప్ చంద్ర, ఎస్పీ సింగ్, ఎంజీ గోపాల్, ఎస్కే జోషి ⇒ నెలాఖరుతో ముగియనున్న రాజీవ్ శర్మ పదవీ కాలం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ ఈ నెలాఖరున పదవీవిరమణ పొందనున్నారు. ఆయన తర్వాత సీఎస్ పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై అధికార వర్గాల్లో చర్చ మొదలైంది. వాస్తవానికి గత మే నెలాఖరున రాజీవ్‌శర్మ పదవీ కాలం ముగిసింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం మూడు నెలల చొప్పున వరుసగా రెండు సార్లు సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించింది. మరోసారి పదవీ కాలం పొడిగించే అవకాశం లేకపోవటంతో రాజీవ్ శర్మ రిటైర్మెంట్కు సంబంధించిన ఫైలు సిద్ధమైంది. దీంతో కొత్త సీఎస్‌గా ఎవరికి అవకాశమిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా (స్పెషల్ సీఎస్) పదోన్నతులు పొందిన ఐఏఎస్‌ల జాబితాలో ఎనిమిది మంది అధికారులున్నారు. వీరిలో సీనియర్ ఐఏఎస్ ప్రదీప్ చంద్ర, ఎస్పీ సింగ్, ఎస్కే జోషిల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నారుు. సీఎం తన విచక్షణాధికారం మేరకు సీనియర్ ఐఏఎస్‌లలో ఒకరిని సీఎస్‌గా నియమించుకునే ఆనవారుుతీ కొనసాగుతోంది. దీంతో కేసీఆర్ ఈసారి కీలక బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తి రేపుతోంది. డిసెంబర్లో ముగియనున్న ప్రదీప్ చంద్ర పదవీకాలం రాజీవ్ శర్మ తర్వాత 1982 బ్యాచ్‌కు చెందిన ప్రదీప్ చంద్ర జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన రెవిన్యూ శాఖ స్పెషల్ సీఎస్‌గా ఉన్నారు. కానీ డిసెంబర్ నెలాఖరున ఆయన రిటైరవనున్నారు. నెల రోజుల్లో పదవీ కాలం ముగిసే ప్రదీప్ చంద్రను సీఎస్‌గా నియమించే అవకాశాలు లేనట్లేనని ప్రచారం జరుగుతోంది. రాజీవ్ శర్మ మే నెలలో రిటైరైతే ప్రదీప్ చంద్రను సీఎస్ పదవి వరిస్తుందనే ప్రచారం జరిగింది. అరుుతే కొత్తగా ఏర్పడిన తెలంగాణలో అనుభవమున్న రాజీవ్ శర్మను కొనసాగించేందుకు సీఎం మొగ్గు చూపారు. దీంతో సీనియర్లు భంగపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రదీప్ చంద్రను తదుపరి సీఎస్‌గా నియమించి రాజీవ్ శర్మ తరహాలో ఆయన పదవీకాలాన్ని పొడిగిం చేందుకు కేంద్రం అనుమతి కోరే అవకాశాలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది. ఎస్పీ సింగ్ పేరు ప్రధానంగా.. ప్రదీప్ చంద్రకు అవకాశం దక్కని పక్షంలో.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ ఎస్పీ సింగ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మిషన్ భగీరథ కార్యక్రమాన్ని విజయవంతం చేయటంతోపాటు నాబార్డు, వివిధ రుణాలను తెచ్చేందుకు ఆయన క్రియాశీల పాత్ర పోషించారనే పేరుంది. మరోవైపు ఇదే బ్యాచ్‌కు చెందిన ఎంజీ గోపాల్, బినయ్ కుమార్, వీకే అగర్వాల్, రంజీవ్ ఆర్ ఆచార్య స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్నారు. వీరందరూ సీఎస్ పదవికి అర్హులు కావటంతో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తి రేపుతోంది. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, ఎంసీఆర్ హెచ్ఆర్డీ డెరైక్టర్ జనరల్ వీకే అగర్వాల్ పదవీ కాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగియనుంది. ప్రస్తుతం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ డీజీగా డిప్యుటేషన్‌పై ఢిల్లీలో ఉన్న బినయ్ కుమార్, వ్యక్తిగత కారణాల వల్ల తాను రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా లేనని ఇప్పటికే ప్రభుత్వానికి సంకేతాలు పంపించినట్లు తెలిసింది. వీరి తర్వాత 1984 బ్యాచ్‌లో ఎస్కే జోషి, అజయ్ మిశ్రా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా ఉన్నారు. సీఎం అత్యంత ప్రాధాన్యమిస్తున్న నీటిపారుదల శాఖకు ఎస్కే జోషి స్పెషల్ సీఎస్‌గా ఉన్నారు. సీఎస్ రేసులో ఉన్న వారిలో ఆయన పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది. -
కొత్త జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సమీక్ష సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి సీఎస్ రాజీవ్ శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కార్యాలయాల ఏర్పాటు, ఉద్యోగుల పంపిణీపై చర్చించనున్నారు. అయితే కొత్త జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ అర్థరాత్రి వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
ప్చ్.. విద్య, వైద్యం!
- రెండేళ్ల పనితీరు బేరీజు వేసుకున్న సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: విద్య, వైద్య రంగాల్లో ఆశించిన పురోగతి సాధించలేకపోయామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ పాలన, వివిధ రంగాల్లో పనితీరును సీఎం ఇటీవల బేరీజు వేసుకున్నారు. సీఎస్ రాజీవ్‌శర్మ, సీఎంవో అధికారులు నర్సింగ్‌రావు, శాంతికుమారి, భూపాల్‌రావు తదితర అధికారులతో వివిధ కార్యక్రమాల్లో పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన వాటికంటే అదనంగా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు వాటి అమలు తీరు సత్ఫలితాలను అందిస్తుందని అభిప్రాయపడ్డారు. మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, దళితులకు భూ పంపిణీ, కోత లేని విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగు ముందుకేసిందన్నారు. ప్రధానంగా విద్యా రంగంపై దృష్టి సారించాల్సి ఉందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీని తట్టుకునేలా, ఉపాధి కల్పించే విద్య అందేలా చూడాలని అభిప్రాయపడ్డారు. అన్ని స్థాయిల్లో విద్యాప్రమాణాల్ని మెరుగుపరచాలన్నారు. వైద్యానికి చికిత్స చేయాలి వైద్య ఆరోగ్య రంగంలో మౌలికవసతుల్ని కల్పించాలని, దశలవారీగా ఆసుపత్రుల్లో కనీస సదుపాయా లను ఆధునీకరించాలని సీఎం అధికారులను ఆదేశిం చారు. నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి అవసరమన్నారు. మహిళల భద్ర త, మహిళల విద్యపై అధ్యయనం చేయాలన్నారు. భ్రూణ హత్యలు, ఆడపిల్లల విక్రయాల వంటి రుగ్మతలు కొనసాగుతున్నాయా అని ఆరా తీయాలన్నారు. వరంగల్, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో కొత్త విమానాశ్రయాల ప్రతిపాదనలు, వాటి భవిష్యత్తు, డ్రై పోర్టులపై సమీక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి, ఉన్నత ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేసే అంశాలపై దృష్టి సారించాలన్నారు. -
'జోనల్ వ్యవస్థను తీసిపారేయండి'
హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలలో తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ భేటీ ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి టీచర్ ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చ జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటును తాము స్వాగతిస్తున్నామని సంఘాల నేతలు శ్రీనివాస్ గౌడ్, దేవీ ప్రసాద్, రవీందర్ రెడ్డి, మమత అన్నారు. గందరగోళానికి కారణమవుతున్న జోనల్ వ్యవస్థను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న జోనల్ పోస్టులను రాష్ట్ర, జిల్లా స్థాయిలుగా విభజించాలని కోరారు. కొత్త రిక్రూట్ మెంట్ జిల్లా స్థాయిలో జరగాలని, అలాట్ మెంట్ రాష్ట్ర స్థాయిలో ఉండాలని చెప్పారు. -
ఏపీ లేఖలతో కొత్త వివాదం
► పదో షెడ్యూల్ సంస్థలకు నేరుగా ఏపీ సర్కారు లేఖలు ► చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఏపీపై తెలంగాణ ఆగ్రహం ► లేఖలు పట్టించుకోవద్దని అన్ని సంస్థలకూ సీఎస్ సర్క్యులర్ సాక్షి, హైదరాబాద్: పదో షెడ్యూల్ సంస్థల ఆస్తులు ఉమ్మడివని.. వాటిని పంచుకుందామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేరుగా సంబంధిత సంస్థల అధిపతులకు లేఖలు రాయడం వివాదాస్పదమవుతోంది. ఏపీ వైఖరిపై తెలంగాణ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ లేఖలను అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం అన్ని సంస్థలకూ ప్రత్యేకంగా సర్క్యులర్ జారీ చేశారు. ఏపీ నుంచి లేఖలు అందుకున్న సంస్థల అధిపతులు వెంటనే తనకు సమాచారం అందించాలని, భవిష్యత్తులోనూ ఏపీ నుంచి ఎటువంటి లేఖలు వచ్చినా తెలియజేయాలని ఆదేశించారు. నేరుగా పదో షెడ్యూల్ సంస్థలకు ఏపీ లేఖలు రాయటం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం నిబంధనలకు పూర్తి విరుద్ధమని సీఎస్ ఇచ్చిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి ప్రభుత్వానికి, లేదా సీఎస్ నుంచి సీఎస్‌కు, లేకపోతే స్టేట్ రీ ఆర్గనైజేషన్(ఎస్ఆర్) టు ఎస్ఆర్ విభాగానికి సమాచార మార్పిడి జరగాలని, పరిపాలనలో అదే సంప్రదాయం పాటించాలని సూచించారు. ఇదేమీ పట్టించుకోకుండా దాదాపు వంద సంస్థలకు ఏపీ లేఖలు రాయడాన్ని సీఎస్ తప్పుబట్టారు. పదో షెడ్యూల్లో మొత్తం 142 సంస్థలు ఉన్నాయి. వీటిలో 122 తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. 16 ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. నాలుగు సంస్థలు రెండు చోట్లా ఉన్నాయి. షెడ్యూల్ పది సంస్థల వ్యవహారాలన్నీ సంయుక్తంగా నిర్వహించాలని, జనాభా నిష్పత్తి ప్రకారం విభజించాలనేది ఏపీ ప్రభుత్వ వాదన. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం భౌగోళికత ఆధారంగా ఈ సంస్థలన్నీ తమకే చెందుతాయనేది తెలంగాణ ప్రభుత్వ వాదన. అవసరమైతే ఏపీ విజ్ఞప్తి మేరకు ఆ సంస్థల సేవలు మాత్రం వినియోగించుకోవచ్చని చెబుతోంది. కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని విభజన వివాద పరిష్కారాల కమిటీలో ఈ వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అన్ని సంస్థల హెచ్వోడీలకు ఏపీ ప్రభుత్వం గత 15 రోజుల నుంచి లేఖలు రాయటం వివాదాస్పదంగా మారింది. -
‘సూరజ్‌కుండ్’ తరహాలో నగరంలో మేళా
- అధికారులతో సీఎస్ రాజీవ్ శర్మ సమాలోచన సాక్షి, హైదరాబాద్: దేశంలో అతిపెద్ద మేళాగా గుర్తింపు పొందిన ‘సూరజ్‌కుండ్’ తరహాలో హైదరాబాద్‌లో కూడా భారీ మేళా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అన్ని రాష్ట్రాలను ఆహ్వానించి త్వరలోనే మేళా నిర్వహించే యోచనలో ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, పర్యాటక శాఖ అధికారులతో ఢిల్లీలో సమాలోచనలు జరిపారు. ఆదివారం ఆయన సూరజ్‌కుండ్ మేళాను సందర్శించారు. కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులతో కలసి ఆయన అక్కడి ప్రదర్శనలను వీక్షించారు. ఈసారి థీమ్ స్టేట్ హోదాలో తెలంగాణ రాష్ట్రం పాల్గొంది. ఈ సందర్భంగా నిర్వాహకులు రాష్ట్ర ప్రతినిధులకు సంప్రదాయరీతిలో ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రం తరఫున ఏర్పాటైన అప్నాఘర్, ఐటీ హబ్, కాకతీయ తోరణం తదితరాలను వారు పరిశీలించారు. తెలంగాణ సంప్రదాయ కళారీతులను మన కళాకారులు ప్రదర్శించారు. తెలంగాణకు పర్యాటకుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో... హైదరాబాద్‌లో కూడా సూరజ్‌కుండ్ తరహా మేళాను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా రాజీవ్‌శర్మ అధికారులతో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేయాల్సిందిగా ఆయన సూచించారు. ప్రదర్శనలో భాగంగా నీటి ధారలో ‘తెలంగాణ’ అక్షరాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన వ్యవస్థ అక్కడి సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. -
బేవరేజెస్ కార్పొరేషన్ రద్దు!
ఏపీ తరహాలో ఎక్సైజ్‌లో ప్రత్యేక శాఖ అయోమయంలో ఉద్యోగులు సాక్షి, హైదరాబాద్: ఆదాయపు పన్ను శాఖ రూ. 1,274 కోట్లు లాగేసుకున్న తరువాత తెలంగాణ సర్కార్ మేలుకుంది. కేంద్రం విధించే పన్నుల నుంచి ఉపశమనం పొందేందుకు తెల్ల ఏనుగులా మారిన తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. శుక్రవారం సీఎస్ రాజీవ్‌శర్మ, ఎక్సైజ్, పోలీస్ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. బేవరేజెస్ కార్పొరేషన్ స్థానంలో ఎక్సైజ్ శాఖలోనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా ఆదాయపు పన్ను శాఖ బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేసి మద్యం డిపోలను సీజ్ చేయడంతోనే ఏపీ ప్రభుత్వం ముందుగా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌ను రద్దు చేసింది. రూ. 1,274 కోట్లు ఖజానా నుంచి లాగేసుకున్న తర్వాత, సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలని కేంద్ర కస్ట మ్స్, ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసిన తర్వాతగానీ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ రద్దు నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఐటీ శాఖతో హైకోర్టులో తలబడుతున్న ప్రభుత్వం సర్వీస్ ట్యాక్స్‌కు సంబంధించి కస్టమ్స్ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతోంది. ఉద్యోగులు ఇక కాంట్రాక్టు పరిధిలోకేనా? ఏపీలో ఏపీబీసీఎల్ను రద్దు చేసి ఎక్సైజ్ శాఖలో విలీనం చేసిన తర్వాత ఉద్యోగులందరూ కాంట్రాక్టు విధానంలోకి మారారు. వారి వేతనాల్లో మార్పు ల్లేకుండా కాంట్రాక్టు ఉద్యోగులుగా వారితోనే మద్యం డిపోల నిర్వహణ, రిటైల్ వ్యాపారులకు అమ్మకాలు చేయిస్తోంది. టీఎస్‌బీసీఎల్‌లో 143 మంది ఉద్యోగులు ఉండగా, మరో 200 మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. వీరంతా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారనున్నారు. తమను ఎక్సైజ్ శాఖ ఉద్యోగులుగా మార్చడమో, వేరే కార్పొరేషన్‌కు బదిలీ చేయడమో చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. -
ఎంత మంది వచ్చినా చేప మందు: రాజీవ్ శర్మ
హైదరాబాద్: మృగశిరకార్తె సందర్భంగా ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ప్రతియేడు అందచేసే చేప మందు ప్రసాదం పంపిణీ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జూన్ 8, 9వ తేదీలలో కొనసాగనుంది. చేప మందు పంపిణీపై తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ వివిధ శాఖల అధికారులతో కలిసి బుధవారం సమీక్ష జరిపారు. భద్రత, మంచినీటి సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఎంత మంది ఆస్తమా రోగులు వచ్చినా అందరికి చేపమందు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. బస్టాండ్, రైల్వేస్టేషన్ల నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులు కల్పిస్తామని సీఎస్ వివరించారు. -
వారంతా రైతులేనా?: మంత్రి పోచారం
సాక్షి,హైదరాబాద్: తమ ప్రభుత్వం వచ్చాకే రైతు ఆత్మహత్యలు మొదలయ్యాయా? అని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న వారంతా రైతులేనా? అని అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వాలని సీఎస్ రాజీవ్‌శర్మ కలెక్టర్లను కోరారని, నివేదిక వచ్చాక రైతు కుటుంబాలను ఆదుకుంటామన్నారు.