బేవరేజెస్ కార్పొరేషన్ రద్దు!
ఏపీ తరహాలో ఎక్సైజ్‌లో ప్రత్యేక శాఖ
అయోమయంలో ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: ఆదాయపు పన్ను శాఖ రూ. 1,274 కోట్లు లాగేసుకున్న తరువాత తెలంగాణ సర్కార్ మేలుకుంది. కేంద్రం విధించే పన్నుల నుంచి ఉపశమనం పొందేందుకు తెల్ల ఏనుగులా మారిన తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. శుక్రవారం సీఎస్ రాజీవ్‌శర్మ, ఎక్సైజ్, పోలీస్ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. బేవరేజెస్ కార్పొరేషన్ స్థానంలో ఎక్సైజ్ శాఖలోనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
కాగా ఆదాయపు పన్ను శాఖ బకాయిలు చెల్లించాలని నోటీసులు జారీ చేసి మద్యం డిపోలను సీజ్ చేయడంతోనే ఏపీ ప్రభుత్వం ముందుగా ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌ను రద్దు చేసింది. రూ. 1,274 కోట్లు ఖజానా నుంచి లాగేసుకున్న తర్వాత, సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలని కేంద్ర కస్ట మ్స్, ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసిన తర్వాతగానీ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ రద్దు నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఐటీ శాఖతో హైకోర్టులో తలబడుతున్న ప్రభుత్వం సర్వీస్ ట్యాక్స్‌కు సంబంధించి కస్టమ్స్ ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతోంది.
ఉద్యోగులు ఇక కాంట్రాక్టు పరిధిలోకేనా?
ఏపీలో ఏపీబీసీఎల్‌ను రద్దు చేసి ఎక్సైజ్ శాఖలో విలీనం చేసిన తర్వాత ఉద్యోగులందరూ కాంట్రాక్టు విధానంలోకి మారారు. వారి వేతనాల్లో మార్పు ల్లేకుండా కాంట్రాక్టు ఉద్యోగులుగా వారితోనే మద్యం డిపోల నిర్వహణ, రిటైల్ వ్యాపారులకు అమ్మకాలు చేయిస్తోంది. టీఎస్‌బీసీఎల్‌లో 143 మంది ఉద్యోగులు ఉండగా, మరో 200 మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. వీరంతా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మారనున్నారు. తమను ఎక్సైజ్ శాఖ ఉద్యోగులుగా మార్చడమో, వేరే కార్పొరేషన్‌కు బదిలీ చేయడమో చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.