- రెండేళ్ల పనితీరు బేరీజు వేసుకున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: విద్య, వైద్య రంగాల్లో ఆశించిన పురోగతి సాధించలేకపోయామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ పాలన, వివిధ రంగాల్లో పనితీరును సీఎం ఇటీవల బేరీజు వేసుకున్నారు. సీఎస్ రాజీవ్‌శర్మ, సీఎంవో అధికారులు నర్సింగ్‌రావు, శాంతికుమారి, భూపాల్‌రావు తదితర అధికారులతో వివిధ కార్యక్రమాల్లో పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన వాటికంటే అదనంగా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు వాటి అమలు తీరు సత్ఫలితాలను అందిస్తుందని అభిప్రాయపడ్డారు.
మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, దళితులకు భూ పంపిణీ, కోత లేని విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగు ముందుకేసిందన్నారు. ప్రధానంగా విద్యా రంగంపై దృష్టి సారించాల్సి ఉందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీని తట్టుకునేలా, ఉపాధి కల్పించే విద్య అందేలా చూడాలని అభిప్రాయపడ్డారు. అన్ని స్థాయిల్లో విద్యాప్రమాణాల్ని మెరుగుపరచాలన్నారు.
వైద్యానికి చికిత్స చేయాలి
వైద్య ఆరోగ్య రంగంలో మౌలికవసతుల్ని కల్పించాలని, దశలవారీగా ఆసుపత్రుల్లో కనీస సదుపాయా లను ఆధునీకరించాలని సీఎం అధికారులను ఆదేశిం చారు. నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి అవసరమన్నారు. మహిళల భద్ర త, మహిళల విద్యపై అధ్యయనం చేయాలన్నారు. భ్రూణ హత్యలు, ఆడపిల్లల విక్రయాల వంటి రుగ్మతలు కొనసాగుతున్నాయా అని ఆరా తీయాలన్నారు. వరంగల్, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో కొత్త విమానాశ్రయాల ప్రతిపాదనలు, వాటి భవిష్యత్తు, డ్రై పోర్టులపై సమీక్షించారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి, ఉన్నత ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్‌ను అభివృద్ధి చేసే అంశాలపై దృష్టి సారించాలన్నారు.
ప్చ్.. విద్య, వైద్యం!
Published Tue, Sep 20 2016 3:11 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement