నిబంధనలు గాలికి! ప్రాణాలు గాలికి ! | Terms of the wind | Sakshi
Sakshi News home page

నిబంధనలు గాలికి! ప్రాణాలు గాలికి !

Published Thu, Nov 26 2015 12:25 AM | Last Updated on Sun, Sep 3 2017 1:01 PM

నిబంధనలు గాలికి! ప్రాణాలు గాలికి !

నిబంధనలు గాలికి! ప్రాణాలు గాలికి !

సిటీబ్యూరో: వాహన చోదకుల అజాగ్రత్త... అధికార యంత్రాంగం నిర్లక్ష్యం... వెరసి రోడ్డు ప్రమాదాల రూపంలో నిత్యం ఎందరినో మృత్యువు పొట్టన పెట్టుకుంటోంది. బుధవారం నగరంలోని ఔటర్ రింగ్ రోడ్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, పేట్ బషీరాబాద్‌ల్లో చోటు చేసుకున్న మూడు రోడ్డు ప్రమాదాలకు నిర్లక్ష్యమే కారణం. ఈ ఉదంతాల్లో ఐదు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మృతులలో మాజీ డీజీపీ పేర్వారం రాములు మనవడు, బంధువు, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి కుమారుడు ఉన్నారు.
 
ప్రాణం తీసిన ‘లైన్’ మార్పు...
 ఓఆర్‌ఆర్‌పై పాల వ్యాన్‌ను వెనుక నుంచి ఢీ కొట్టిన ప్రమాదంలో పేర్వారం రాములు మనవడు వరుణ్ పవార్ సహా ముగ్గురు మరణించగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. జాతీయ రహదారులతో పాటు ఈ తరహా రోడ్లపై ఏ వాహనాలు ఏ లైన్‌లో వెళ్లాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఓఆర్‌ఆర్ విషయానికివస్తే ఒక్కో వైపు నాలుగు లైన్లుగా ఉండే ఈ రహదారిలో కుడి నుంచి ఎడమకు వేగంగా వెళ్లే వాటి నుంచి పరిమిత స్పీడ్‌తో వెళ్లే వాటి వరకు ప్రయాణించాల్సి ఉంది. దీనిపై  పూర్తి స్థాయిలో ప్రచారం లేదు.ఈ విషయాన్ని హెచ్‌ఎండీఏ పట్టించుకోలేదు. ఫలితంగా వరుణ్ తదితరులు ప్రయాణిస్తున్న స్కోడా కారు లైను మారి పాల వ్యాను వెనక్కు వచ్చింది. అతి వేగంతో ఢీ కొట్టింది.

 ప్రాణం పోయినా మార్పు లేదు...
 చిక్కడపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ప్రమాదంలో రాజేందర్‌రెడ్డి కుమారుడు విశాల్‌రెడ్డి కన్ను మూశారు. దీనికి ప్రధాన కారణం ఆ ప్రాంతంలో రోడ్లపై ఉన్న గోతులే. ‘గొయ్యి చూపిస్తే వెయ్యి’ అంటూ జీహెచ్‌ఎంసీ చేసిన ప్రకటనలు ఏనాడో గాలిలో కలిసిపోయాయి. గల్లీలు, ఇతర రోడ్లలో ఉన్న గుంతల మాట అటుంచినా... అనునిత్యం అత్యంత రద్దీగా ఉండే ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌నే జీహెచ్‌ఎంసీ పట్టించుకోలేదు. ఈ ప్రమాదం జరిగిన చోటే కొద్ది గంటల ముందు (మంగళవారం అర్థరాత్రి) మరో ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డు అధ్వానంగా ఉండటమే కారణమని తెలిసినా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ సహా ఏ ఒక్కటీ స్పందించలేదు. మొదటి ప్రమాదం జరిగిన వెంటనే నిర్లక్ష్యాన్ని వీడి ఉంటే రెండో ప్రాణం దక్కేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
 
మలుపులోనూ మితిమీరిన వేగం

 పేట్ బషీరాబాద్‌లో దూలపల్లి చౌరస్తా వద్ద ప్రమాదంలో స్థానికురాలైన నాగ మనోహరమ్మ అక్కడిక్కడే మృతి చెందారు. జాతీయ రహదారైనా ప్రాంతాన్ని బట్టి వేగ పరిమితులు ఉంటాయి. ప్రధానంగా మలుపులు, జనసమ్మర్థ ప్రాంతాలు, జంక్షన్ల వద్ద నెమ్మదిగా వెళ్లాలంటూ సూచికలు ఏర్పాటు చేస్తారు. వీటిని వాహన చోదకులు కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తూ దూలపల్లి వైపు నుంచి మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన కారుమనోహరమ్మ పాలిట మృత్యు శకటమైంది. ఆ కుటుంబానికి తీరని
విషాదాన్ని మిగిల్చింది.

మూడు సెక్షన్లే దిక్కా?
 నగరంలో ఏటా వందల మంది ఉసురుతీస్తున్న రోడ్డు ప్రమాదాలపై కేసులు నమోదు చేయడానికి ప్రత్యేక చట్టమంటూ ఇప్పటి వరకు లేదు. వీటినీ లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) కిందే నమోదు చేస్తుంటారు. సాధారణంగా ప్రమాదాల కేసులన్నీ కేవలం మూడు సెక్షన్ల కిందికే వస్తున్నాయి. బాధితులకు సాధారణ స్థాయిలో గాయాలు తగిలితే ఐపీసీ-337, తీవ్ర గాయాలైతే ఐపీసీ-338, మృతి చెందితే ఐపీసీ-304 (ఏ) కింద నమోదు చేస్తున్నారు. అతితక్కువ ఉదంతాల్లో మాత్రమే వాహనాన్ని  నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి ఎంవీ యాక్ట్-185 సెక్షన్ మాత్రం కలుపుతున్నారు. రోడ్డు ప్రమాదానికి వాహన చోదకుడితో పాటు ఇతర విభాగాల నిర్లక్ష్యమూ కారణమయ్యే ఉదంతాలు ఎన్నో ఉంటున్నాయి. అలాంటి సందర్భాల్లో జరిగే ప్రమాదాలపై ఐపీసీ 304 పార్ట్ 2 కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది. రోడ్డుపై గుంతల విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం మొదలు అనేక ఇంజినీరింగ్ లోపాలపై దృష్టి పెట్టి ఆయా సంస్థల్ని బాధ్యులను చేసిన సందర్భాలు అత్యంత అరుదనే చెప్పుకోవచ్చు. ప్రాణాంతకమని తెలిసీ నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తే బెయిల్ కష్టసాధ్యం కావడంతో పాటు శిక్షలూ పెరుగుతాయి. పోలీసు విభాగం మాత్రం ఇలా నమోదు చేయడంలో వెనుకడుగు వేస్తోంది.

ఈ చర్య నగరంలో సాధ్యమేనా?
భద్రతా ప్రమాణాలు పాటించని... ప్రమాదమని తెలిసీ నిర్లక్ష్యంగా వ్యవహరించే పౌర సేవా విభాగాలపై బెంగళూరు పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. అక్కడి దేవరబీనహల్లీ ఫ్లైఓవర్‌పై చోటు చేసుకున్న ప్రమాదంలో పోలీసుల స్పందనే దీనికి నిదర్శనం. అంతర్జాతీయ విమానాశ్రయానికి దారి తీసే ఆ ఫ్లైఓవర్‌పై డివైడర్లు ప్రమాదభరితంగా ఉన్నాయని, వాటికి సూచిక బోర్డులు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాల్సిందిగా బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు రాసిన లేఖలను బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (బీడీఏ) నిర్లక్ష్యం చేసింది. దీంతో ఈ ఫ్లైఓవర్‌పై క్యాబ్ వాహనానికి జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు. తీవ్రంగా పరిగణించిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన బీడీఏ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.శ్రీపద్‌రాజు, అసిస్టెంట్ ఇంజినీర్ ప్రదీప్‌లపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఇలాంటి చర్యలు తీసుకుంటే తప్ప నగరంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి చెక్ పడదని నిపుణులు వాదిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement