14వ ఆర్థిక సంఘం నిధుల పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సీఎస్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ
సాక్షి, హైదరాబాద్: 14వ ఆర్థిక సంఘం నిధుల పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐదేళ్లలో రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ.5375.28 కోట్లు మంజూరవుతాయి. ఈ ఏడాది ఇప్పటికే రూ.1030 కోట్లు విడుదలయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు.
వీరితో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, గిరిజిన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, విద్యా శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఏడాదికోసారి సమావేశమవుతుంది. అవసరాన్ని బట్టి మధ్యలోనూ సమావేశమై నిధుల వినియోగంపై సమీక్షిస్తుంది. కమిటీ సభ్యులతో పాటు సంబంధిత శాఖల అధికారులు ఈ నిధులతో గ్రామస్థాయిలో జరుగుతున్న పనులను పర్యవేక్షించి ఎప్పటికప్పుడు పురోగతిపై సమీక్షిస్తారు.