పట్టపగలు దారుణ హత్య
యువకుడిని కత్తితో పొడిచి చంపిన పాత నేరస్తుడు
- బంజారాహిల్స్‌లో నడిరోడ్డుపై ఘటన
- ఇద్దరూ పాత నేరస్తులే.. ఇద్దరూ పోలీస్ ఇన్‌ఫార్మర్లే!
- పాత కేసులు గుర్తుచేస్తూ పోలీసులను రెచ్చగొడుతున్నాడంటూ కక్ష
- మాట్లాడదామంటూ పిలిచి హత్య
హైదరాబాద్: సమయం శనివారం మధ్యాహ్నం 3 గంటలు.. ఎప్పుడూ బిజీగా ఉండే బంజారాహిల్స్ ప్రాంతం.. రోడ్ నంబర్ 7లో రోడ్డు పక్కన ఇద్దరు మాట్లాడుకుంటున్నారు.. ఇంతలో ఒకతను తన వెంట తెచ్చిన కత్తి బయటికి తీశాడు.. మరో వ్యక్తిని విచ్చలవిడిగా పొడిచి చంపేశాడు.. ఆ ఇద్దరూ పాత నేరస్తులే.. ఇద్దరూ పోలీస్ ఇన్‌ఫార్మర్లే! తనపై ఉన్న కేసుల గురించి సమాచారమిచ్చి అరెస్టు చేయించడానికి ప్రయత్నిస్తున్నాడనే ఆగ్రహంతో వసీం అనే పాత నేరస్తుడు మారోజు రత్నాచారి (28) అనే ఆటోడ్రైవర్‌ను హత్య చేశాడు.
మాట్లాడదాం రమ్మని చెప్పి..
నల్లగొండ జిల్లా వలిగొండ మండలం దుప్పెల్లికి చెందిన మారోజు రత్నాచారి తన భార్య ముగ్గురు పిల్లలతో కలసి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఎన్‌బీటీ నగర్‌లో ఉంటున్నాడు. ఆటోడ్రైవర్‌గా, అద్దె ఇళ్ల బ్రోకర్‌గా పనిచేస్తున్నాడు. అతడిపై బైక్ చోరీలు, చైన్ స్నాచింగ్ కేసులున్నాయి. ఈ క్రమంలో పోలీసు ఇన్‌ఫార్మర్‌గా మారాడు. రత్నాచారికి పోలీస్ ఇన్‌ఫార్మర్‌గానే పనిచేసే పాత నేరస్తుడు వసీంతో కొంత కాలం కింద పరిచయమైంది. వసీం కూడా పలు స్నాచింగ్ కేసుల్లో అరెస్టై విడుదల అయ్యాడు. అయితే ఈ మధ్య హైదరాబాద్, సైబరాబాద్‌ల పరిధిలోని ఐదు పోలీస్‌స్టేషన్లలో పెద్ద సంఖ్యలో చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. అందులో సరూర్‌నగర్ సీసీఎస్‌లో వసీంపై కేసు కూడా ఉంది.
ఈ క్రమంలో వసీం అడ్రస్ చెబుతానని, అతడిని అరెస్టు చేయాలంటూ సరూర్‌నగర్ సీసీఎస్‌కు రత్నాచారి సమాచారమిచ్చాడు. దీంతో ఆగ్రహించిన వసీం.. రత్నాచారిపై కక్షగట్టాడు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో రత్నాచారికి ఫోన్ చేసి రోడ్ నంబర్ 7లోని మీసేవ వద్దకు రావాలని, మాట్లాడుకుందామని పిలిచాడు. కొంత సేపటికి చారి అక్కడికి రాగానే.. తనతో పాటు తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. దీంతో చారి చెయ్యి తెగిపోయింది, తలపై తీవ్ర గాయాలై.. అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. శనివారం సాయంత్రమే వసీంను అదుపులోకి తీసుకున్నారు.