
ఆ రహస్యం ఖరీదు 52 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని రాష్ట్ర అభివృద్ధికి పాటు పడుతున్నానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతుంటారు. కానీ.. ఆచరణలో జరుగుతున్నది వేరే. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తన కోటరీకి లీక్ చేసి ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’కు పాల్పడడం ద్వారా అత్తెసరు ధరలకే రైతుల భూములు కొట్టేసి ఇప్పటికే రూ.లక్ష కోట్లు దోచుకున్నారు. ఇపుడు రాజధాని నిర్మాణం ముసుగులో మొదటి విడతలోనే మరో రూ.52,493.6 కోట్లు కొల్లగొట్టడానికి పథకం వేశారు. సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదనలకన్నా మెరుగైన ప్రతిపాదనలు ఉంటే దాఖలు చేసుకోవచ్చునంటూ జూలై 18న స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. కానీ.. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంతో సింగపూర్ సంస్థల కన్సార్టియం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తాయన్నది గోప్యంగా ఉంచారు. ఈ గోప్యత వెనుకే చంద్రబాబు అండ్ కో రూ.52,493.6 కోట్ల దోపిడీ ఎత్తుగడ దాగి ఉంది.
రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ఇదీ..
రాజధాని నిర్మాణానికి భూసమీకరణ పేరుతో 33 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి ప్రభుత్వం లాక్కుంది. ఇందులో 1,691 ఎకరాల భూమిని రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం సింగపూర్ సంస్థల కన్సార్టియంకు అప్పగించాలని నిర్ణయించారు. ఇందులో 371 ఎకరాల్లో రహదారులు, పార్కులు, మురుగునీటి కాలువలు వంటి కనీస మౌలిక సదుపాయాలకు కేటాయించారు. తొలి విడతగా 50 ఎకరాలు.. రెండో దశలో 200 ఎకరాల భూమిని సింగపూర్ సంస్థలకు ఉచితంగా ప్రభుత్వం అప్పగిస్తుంది. ఇవన్నీ పోను మిగతా 1,070 ఎకరాలను అభివృద్ధి చేసి.. ప్లాట్లుగా వేసి విక్రయిస్తారు.
మేనేజ్‌మెంట్ కంపెనీ ముసుగులో...
రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ సంస్థల కన్సార్టియం, సీసీడీఎంసీలతో ఏర్పాటయ్యే ఏడీపీ చేపడుతుంది. అయితే ప్లాట్లను విక్రయించే పనిని చూసేందుకు ఓ మేనేజ్‌మెంట్ కంపెనీని ఏర్పాటు చేయనున్నారు. అందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రాతినిధ్యమూ ఉండదు. సింగపూర్ కంపెనీల ప్రతినిధులు, చంద్రబాబు బినామీలే సభ్యులుగా ఉంటారు. ప్లాట్లను ఎవరికి, ఎంతకు విక్రయించాలనేది ఈ మేనేజ్‌మెంట్ కంపెనీయే చూస్తుంది. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం రూ.3,137 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో సింగపూర్ సంస్థల కన్సార్టియం వాటా రూ.306.4 కోట్లు. సీసీడీఎంసీ వాటా రూ.221.9 కోట్లు. మిగతా రూ.2,618.70 కోట్లను బ్యాంకుల్లో భూమిని తనఖా పెట్టి రుణాలు సేకరించడం ద్వారా, ప్లాట్ల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాన్ని వెచ్చిస్తారు. ఇందులో 1,255.40 కోట్లను ప్రచార ఖర్చులు, కన్సల్టెన్సీ ఫీజు, డెవలప్‌మెంట్ ఫీజు, మేనేజ్‌మెంట్ ఫీజు, వేతనాల రూపంలో.. మేనేజ్‌మెంట్ కంపెనీ ముసుగులో చంద్రబాబు బినామీలు, సింగపూర్ సంస్థల కన్సార్టియం కొట్టేయనున్నాయి.
రూ.52వేల కోట్లు కొట్టేసేదిలా...
రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ సంస్థల నియమించే మేనేజ్‌మెంట్ కంపెనీకి ఏడీపీ అప్పగిస్తుంది. ఈ మేనేజ్‌మెంట్ కంపెనీ ఏదన్నది ప్రతిపాదనల్లో వెల్లడించకుండా గోప్యంగా ఉంచారు. ఆ మేనేజ్‌మెంట్ కంపెనీ సీఎం చంద్రబాబునాయుడు బినామీలది కావడం వల్లే గోప్యంగా ఉంచారన్నది బహిరంగ రహస్యం. ఈ మేనేజ్‌మెంట్ కంపెనీ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును అభివృద్ధి చేయడంతోపాటూ.. ప్లాట్లను విక్రయిస్తుంది. ప్రభుత్వం ఎకరం భూమి కనీస ధరను రూ.నాలుగు కోట్లుగా నిర్ణయించింది. ఒకవేళ ఏదైనా సంస్థకు రూ.నాలుగు కోట్ల కన్నా తక్కువకు ఎకరం భూమి ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తే.. ఆ తగ్గించిన మొత్తాన్ని సర్కారే మేనేజ్‌మెంట్ కంపెనీకి చెల్లించాలి. అదే ఎక్కువకు అమ్మితే ప్రభుత్వ జోక్యం ఉండదు.
మేనేజ్‌మెంట్ కంపెనీని అడ్డుపెట్టుకుని ప్లాట్లను భారీ రేట్లకు విక్రయించడం ద్వారా వేలకోట్లను కొట్టేసేందుకు చంద్రబాబు అండ్ కో, సింగపూర్ సంస్థల కన్సార్టియం ఎత్తులు వేస్తున్నాయి. కుంభకోణంలో కీలకమైన అంకం ఇదే. ప్రస్తుతం విజయవాడలో ప్రధానమైన ప్రాంతాలలో చదరపు గజం రూ. లక్ష పలుకుతోందని చంద్రబాబే చెబుతున్నారు. ఈ లెక్కన కోర్ కేపిటల్‌కు సమీపాన ఉండే స్టార్టప్ ఏరియా ప్రాంతంలో అదే ధర పలుకుతుందని లెక్క వేసుకున్నా ఎకరం రూ. 40 కోట్లు పలుకుతుంది.
ఈ లెక్కన 1,070 ఎకరాల భూమిని అమ్మి రూ.42,800 కోట్లను చంద్రబాబు అండ్ కో, సింగపూర్ సంస్థల కన్సార్టియం సొమ్ము చేసుకోనున్నాయి. తొలుత 50 ఎకరాలు, రెండో దశలో 200 ఎకరాల భూమి సింగపూర్ సంస్థల కన్సార్టియంకు సర్కార్ కట్టబెట్టనుంది. ఈ 250 ఎకరాలను ఎకరం రూ.40 కోట్ల చొప్పున అమ్ముకున్నా రూ.10,000 కోట్లు ఆ సంస్థలు సొమ్ముచేసుకోనున్నాయి. 1,070 ఎకరాలకు వచ్చే రూ.42,800 కోట్లు, 250 ఎకరాలకు వచ్చే 10,000 కోట్లు కలిపితే సింగపూర్ సంస్థలకు వచ్చే ఆదాయం రూ. 52,800 కోట్లు అన్నమాట. ఇంతకీ వాటి పెట్టుబడి ఎంతంటే రూ.306.4 కోట్లు మాత్రమే. దీనిని బట్టి చూస్తే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనే చంద్రబాబు అండ్ కో, సింగపూర్ సంస్థలు రూ.52,493.6 కోట్లను కాజేయనున్నట్లు స్పష్టమవుతోంది.
ఈ దోపిడీని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు..
ప్రభుత్వ రంగ సంస్థలు ఏ పని చేపట్టినా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఆడిటింగ్ చేస్తాయి. అక్రమాలపై ఎవరైనా పోలీసులను, కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంది. ఆడిటింగ్‌కు దక్కకుండా.. సీఆర్‌పీసీ, ఐపీసీ చట్టాలకు చిక్కకుండా దోపిడీ చేసేందుకే ‘మేనేజ్‌మెంట్ కంపెనీ’ అనే బినామీ ప్రైవేటు సంస్థను చంద్రబాబు, సింగపూర్ సంస్థల కన్సార్టియం తెరపైకి తెచ్చాయి. ఈ సంస్థ ఎకరం రూ.40 కోట్లుకు విక్రయించి.. 4 కోట్లకే అమ్మినట్లు లెక్కలు చూపినా ప్రశ్నించే అధికారం రాష్ట్ర ఆడిటింగ్ అధికారులకుగానీ.. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)కుగానీ ఉండదు. ఈ అక్రమాల పర్వంపై పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశమూ ఉండదు. భారతీయ కోర్టును ఆశ్రయించే అవకాశం లేనే లేదు. ఒకవేళ ఏవైనా వివాదం ఉంటే.. ఇంగ్లాండ్‌లోని లండన్ కోర్టును ఆశ్రయించాల్సిందే!
స్టార్టప్ ప్రాజెక్టులో సర్కారుకు అంతా నష్టమే
స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో ఎకరం కనీసధర రూ.4 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. (అంతకు మించి అమ్మితే ప్రభుత్వ ప్రమేయం ఉండదు.) రూ. 4 కోట్ల లెక్కన 1,691 ఎకరాల విలువ రూ.10,764 కోట్లు చేస్తుంది. ఈ భూమికి రహదారులు, నీటి సౌకర్యం, వరద మళ్లింపు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.5,500 కోట్లను ఖర్చు చేయడానికి సర్కారు అంగీకరించింది. అంతే కాదు.. ఏడీపీలో సీసీడీఎంసీ వాటా రూపంలో రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది. వెరసి రూ.16,485 కోట్లను ప్రభుత్వం పెట్టుబడి పెడుతుందన్న మాట. అయితే సర్కారుకు వచ్చేది మాత్రం శూన్యం. రూ. 5,500 కోట్లతో మౌలిక వసతులు కల్పించి, ప్లాట్లు అభివృద్ధి చేయడానికి రూ. 3,137 కోట్లను తనే బ్యాంకు గ్యారెంటీ ఇప్పిస్తుంది. ఈ వ్యయాన్ని మినహాయించుకుని మిగిలిన మొత్తంలో 58శాతం, 42 శాతం నిష్పత్తిలో సీసీడీఎంసీ, సింగపూర్ కన్సార్టియం పంచుకుంటాయి. అంటే ఈ లెక్కన ప్రభుత్వానికి పెట్టిన ఖర్చు కూడా వచ్చే అవకాశాలు లేవు. అయితే సింగపూర్ కంపెనీలు నయాపైసా పెట్టుబడి పెట్టబోవడం లేదు. రాజధానిలో ఒక్క భవనాన్నీ నిర్మించవు. కేవలం 1,070 ఎకరాలలో ప్లాట్లు వేసి అమ్ముకుంటారు. కానీ ప్రభుత్వం తమకు ఉచితంగా కట్టబెట్టిన 50ఎకరాలలో 8 లక్షల చదరపు అడుగుల మేర భవనాలను నిర్మించి వాటిని కూడా అమ్ముకుని సొమ్ము చేసుకుంటారు.
సీసీడీఎంసీకి దక్కేది బూడిదే..
ఏడీపీలో సింగపూర్ సంస్థల కన్సార్టియంది 58 శాతం వాటా.. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సీసీడీఎంసీ వాటా 42 శాతం. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు ప్రాథమికంగా రూ.3,137 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఆ వ్యయం ఎంతకైనా పెరగవచ్చు. ఆ మేరకు నిబంధనలు కూడా చేర్చారు. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ద్వారా 1,070 ఎకరాలను ఎకరం రూ.4 కోట్ల చొప్పున (ప్రభుత్వం నిర్ణయించిన బేసిక్ ధరకు మించి సింగపూర్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఎన్ని కోట్లకు విక్రయించినా దానిపై ప్రభుత్వానికి అధికారం ఉండదు.) విక్రయించగా వచ్చే మొత్తం ఆదాయంలో ప్రభుత్వానికి వాటా ఇవ్వగా మిగిలిన సొమ్ము ఏడీపీకి వస్తుంది. అంటే.. ఎకరం రూ.4 కోట్ల చొప్పున విక్రయించి.. ప్రభుత్వానికి గ్రాస్ రెవెన్యూ షేర్‌లో పది శాతం వాటా ఇస్తే ఏడీపీకి రూ.3,852 కోట్లు. ఏడీపీకి ఇచ్చే 250 ఎకరాల్లో ఎకరం రూ.నాలుగు కోట్ల చొప్పున విక్రయిస్తే వచ్చే సొమ్ము రూ.వెయ్యి కోట్లను కలిపితే రూ.4,852 కోట్లు వస్తుంది. రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు వ్యయం రూ.3,137 కోట్ల నుంచి ఏటా 20 శాతం చొప్పున పెరిగితే.. సీసీడీఎంసీకి దక్కేది బూడిదే. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో నష్టం వస్తే ఆ మేరకు సింగపూర్ సంస్థలకు రాష్ర్టప్రభుత్వం పరిహారం చెల్లించాలి.
స్విస్ చాలెంజ్.. ఓ మహా కుంభకోణం
స్విస్ చాలెంజ్ విధానం నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు ఆక్షేపించినా.. వచ్చే ఆదాయంలో రహస్యం ఏమిటని అక్షింతలు వేసినా రాష్ర్టప్రభుత్వం చలించలేదు. చివరకు స్టే ఇచ్చినా అందులోని దేవరహస్యాన్ని మాత్రం బైటపెట్ట లేదు. పైగా స్టేని ఎత్తేయించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇంతకీ ఆ రహస్యం ఖరీదెంతనుకున్నారు? అక్షరాలా రూ.52,493.6 కోట్లు. నయా పైసా పెట్టుబడి పెట్టకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బినామీల గుప్పిట్లోని మేనేజ్‌మెంట్ కంపెనీ, సింగపూర్ సంస్థల కన్సార్టియంలు కొట్టేయనున్న మొత్తమిది. చరిత్రలో మునుపెన్నడూ కనీవిని ఎరుగని కుంభకోణమిది. 1,691 ఎకరాల స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనేరూ.52,493.6 కోట్లు కొట్టేస్తుంటే ఇక 54 వేల ఎకరాల (రైతుల నుంచి సమీకరించిన 34వేల ఎకరాలు, ప్రభుత్వ అధీనంలో ఉన్న 20వేల ఎకరాలు కలిపి) రాజధాని నిర్మాణంలో ఎన్ని లక్షల కోట్లు కొట్టేస్తారో ఊహకు కూడా అందని విషయం.
భూతల స్వర్గాన్ని తలపించే రీతిలో అంతర్జాతీయ నగరాలను తలదన్నేలా రాజధాని నిర్మిస్తామంటూ చంద్రబాబు 3డీ సినిమా చూపించడంతో సామాన్యుల మొదలు సంపన్నుల వరకు ఇటుకలు, విరాళాలు ఇచ్చి ఎదురుచూస్తున్నారు. కానీ బాబు ఆయన బినామీల సమాహారమైన సింగపూర్ కన్సార్టియం మాత్రం కనీసం ఒక్క భవనం కూడా కట్టకుండా రియల్ ఎస్టేట్ దందా చేసి స్టార్టప్ ప్రాజెక్టులోనే రూ.52,493.6 కోట్లు కొల్లగొట్టేయనున్నారు. ఆ రహస్య పథకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా... అయితే ఇది చదవండి....