హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ కొత్త భవనం
డిజైన్ ఆవిష్కరించిన కాన్సుల్ జనరల్
సాక్షి, హైదరాబాద్: యూఎస్ కాన్సులేట్‌కు హైదరాబాద్‌లో సరికొత్త భవవనం నిర్మించనున్నట్టు కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్ చెప్పారు. అరిజోనాకు చెందిన రిచర్డ్స్ బయర్ సంస్థ రూపొం దించిన భవన డిజైన్‌ను శుక్రవారం హోటల్ పార్క్‌హయత్‌లో ఆయన ఆవిష్కరించారు. ముల్లిన్స్ మాట్లాడుతూ.. నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 12.3 ఎకరాల విస్తీర్ణంలో పర్యావరణ హితమైన అధునాతన భవనాన్ని నిర్మించనున్నామన్నారు. హైదరాబాద్ వినూత్న భౌగోళిక స్వరూపానికి అనుగుణంగా ప్రత్యేక డిజైన్లతో నిర్మాణం ఉంటుందన్నారు. ప్రపంచలోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయాల్లో ఐదో అతిపెద్ద భవనం ఇదే అవుతుందన్నారు.
ఇందుకు అవసరమైన నిధులు ఈ ఏడాది సెప్టెంబరులో మంజూరయ్యే అవకాశం ఉందని, ఆ తరువాత గ్లోబల్ టెండర్లు పిలిచి వచ్చే ఏడాది ఆగస్టులో శంకుస్థాపన చేస్తామన్నారు. అక్టోబరు 2020 కల్లా నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, నూతన ప్రాంగణంలో రోజుకు సుమారు రెండు వేల మందికి వీసా ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు వీలవుతుందన్నారు. ఇందుకోసం 52 విండోలు ఏర్పాటు చేస్తామన్నారు. బ్యాంకులు, ప్రముఖ ఆసుపత్రులు, ప్రఖ్యాత హోటళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థల నడుమ అందమైన, కాన్సులేట్ ప్రాంగణం హైదరాబాద్ ప్రజలకు గొప్ప బహుమతి కానుందని ముల్లిన్స్ చెప్పారు.