Michael mullins
-
ఉన్నత విద్యాభ్యాసానికి కేరాఫ్ అడ్రస్ అమెరికా
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్య అభ్యసించడానికి అమెరికా కేరాఫ్ అడ్రస్‌గా మారిందని యూఎస్ కాన్సుల్ జనరల్ (హైదరాబాద్) మైఖేల్ ముల్లిన్స్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్‌లో గురువారం ‘స్టూడెంట్ వీసా డే’ నిర్వహించారు. ఈ ఒక్క రోజే దాదాపు 700 మందికిపైగా విద్యార్థులు వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అన్ని రకాల అర్హతలున్న విద్యార్థులకు అప్పటికప్పుడే వీసాలను ముల్లిన్స్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా వీసాలు పొందిన విద్యార్థులతో అమెరికాలో చదువుకున్న భారతీయ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు. అనంతరం ముల్లిన్స్ మాట్లాడుతూ.. స్టూడెంట్ వీసా డే సందర్భంగా చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబైలో ఉన్న కాన్సులేట్ జనరల్ కార్యాలయాల్లో 4 వేల మంది విద్యార్థులు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఒక్క హైదరాబాద్ కార్యాలయం నుంచే 700 మందికి పైగా విద్యార్థులు దరఖాస్తులు సమర్పించారని పేర్కొన్నారు. చైనా తర్వాత ఇండియా నుంచే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు యూఎస్‌ను ఆశ్రయిస్తున్నారని.. అక్కడ నైపుణ్యంతో కూడిన నాణ్యమైన విద్య, పేరుగాంచిన యూనివర్సిటీలు ఉండటమే కారణమని అన్నారు. అమెరికాలో విద్య తీరు, సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం తదితర అంశాలపై అమెరికా పూర్వ విద్యార్థులతో త్వరలో ఇక్కడి వారికి అవగాహన కల్పిస్తామని కాన్సులర్ చీఫ్ జామ్సన్ ఫాస్ వెల్లడించారు. జూలై నెలాఖరున ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశాలున్నాయని చెప్పారు. గత ఐదేళ్లలో వీసా పొందేవారి సంఖ్య 80 శాతం పెరిగిందన్నారు. వీసాలు తీసుకుంటున్న వారిలో విద్యార్థులే అత్యధికమని చెప్పారు. కార్యక్రమంలో ఎన్ఐవీ చీఫ్ బ్రియాన్ సాల్వర్సన్, అసిస్టెంట్ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ జెన్నిఫర్ గోల్డ్‌స్టీన్, యూఎస్ఈఎఫ్/ఎడ్యుయూఎస్ఏ రీజినల్ ఆఫీసర్ పియా బహదూర్ తదితరులు మాట్లాడారు. -
హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ కొత్త భవనం
డిజైన్ ఆవిష్కరించిన కాన్సుల్ జనరల్ సాక్షి, హైదరాబాద్: యూఎస్ కాన్సులేట్‌కు హైదరాబాద్‌లో సరికొత్త భవవనం నిర్మించనున్నట్టు కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్ చెప్పారు. అరిజోనాకు చెందిన రిచర్డ్స్ బయర్ సంస్థ రూపొం దించిన భవన డిజైన్‌ను శుక్రవారం హోటల్ పార్క్‌హయత్‌లో ఆయన ఆవిష్కరించారు. ముల్లిన్స్ మాట్లాడుతూ.. నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 12.3 ఎకరాల విస్తీర్ణంలో పర్యావరణ హితమైన అధునాతన భవనాన్ని నిర్మించనున్నామన్నారు. హైదరాబాద్ వినూత్న భౌగోళిక స్వరూపానికి అనుగుణంగా ప్రత్యేక డిజైన్లతో నిర్మాణం ఉంటుందన్నారు. ప్రపంచలోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయాల్లో ఐదో అతిపెద్ద భవనం ఇదే అవుతుందన్నారు. ఇందుకు అవసరమైన నిధులు ఈ ఏడాది సెప్టెంబరులో మంజూరయ్యే అవకాశం ఉందని, ఆ తరువాత గ్లోబల్ టెండర్లు పిలిచి వచ్చే ఏడాది ఆగస్టులో శంకుస్థాపన చేస్తామన్నారు. అక్టోబరు 2020 కల్లా నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, నూతన ప్రాంగణంలో రోజుకు సుమారు రెండు వేల మందికి వీసా ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు వీలవుతుందన్నారు. ఇందుకోసం 52 విండోలు ఏర్పాటు చేస్తామన్నారు. బ్యాంకులు, ప్రముఖ ఆసుపత్రులు, ప్రఖ్యాత హోటళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థల నడుమ అందమైన, కాన్సులేట్ ప్రాంగణం హైదరాబాద్ ప్రజలకు గొప్ప బహుమతి కానుందని ముల్లిన్స్ చెప్పారు. -
యూఎస్ కాన్సుల్ జనరల్‌తో కేటీఆర్ భేటీ
వీసా విషయంలో తెలుగు విద్యార్థుల ఇబ్బందులపై చర్చ సాక్షి, హైదరాబాద్: అమెరికాలో తెలుగు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్‌కు ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లి కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్‌తో చర్చించారు. ఈ సమస్య ఒక్క హైదరాబాద్ విద్యార్థులే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల విద్యార్థులది అని తెలిపారు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని ముల్లిన్స్ హామీ ఇచ్చారు. విద్యార్థులు ప్రైవేటు ఏజెంట్ల మోసానికి గురి కాకుండా, యూఎస్-ఇండియా ఎడ్యుకేషన్ ఫెయిర్లను పటిష్టంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తెలుగు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాస్తానని పేర్కొన్నారు. అమెరికాలోని హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని కోరతానని చెప్పారు. సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా నకిలీ ధ్రువపత్రాలు సృష్టిస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల డాక్యుమెంట్లను అమెరికాలో కాకుండా ఇక్కడ తనిఖీ చేశాకే వీసాలు మంజూరు చేయాలని యూఎస్ కాన్సులేట్‌కు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. తెలుగు విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించిన అమెరికా అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. -
గీతాంజలి పాఠశాల 29వ వార్షికోత్సవం
-
హైదరాబాద్‌లో యూఎస్ కాన్సుల్ జనరల్‌గా మైఖేల్ ములిన్స్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయ ప్రధాన అధికారి హోదా అయిన యూఎస్ కాన్సుల్ జనరల్‌గా మైఖేల్ ములిన్స్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈనెల ఏడోతేదీన బాధ్యతలు చేపట్టినట్టు ఇక్కడి యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ములిన్స్ ఇప్పటివరకు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో.. ‘మినిస్టర్ కాన్సులర్ ఫర్ మేనేజ్మెంట్ అఫైర్స్’ హోదాలో పనిచేశారు. సీనియర్ ఫారిన్ సర్వీసు అధికారి అయిన ములిన్స్ మినిస్టర్ కాన్సులర్ హోదాలో ఉన్నారు. ఆయన ఇంతకుముందు థాయిలాండ్, వియత్నాం, హాంకాంగ్, ఇండొనేసియా తదితర దేశాల్లో ఫారిన్ సర్వీసు అధికారిగా పనిచేశారు. ఫారిన్ సర్వీసుకు సంబంధించి ఆయన ఇప్పటివరకు ఆరు అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు.