హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయ ప్రధాన అధికారి హోదా అయిన యూఎస్ కాన్సుల్ జనరల్‌గా మైఖేల్ ములిన్స్ బాధ్యతలు స్వీకరించారు.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయ ప్రధాన అధికారి హోదా అయిన యూఎస్ కాన్సుల్ జనరల్‌గా మైఖేల్ ములిన్స్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈనెల ఏడోతేదీన బాధ్యతలు చేపట్టినట్టు ఇక్కడి యూఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ములిన్స్ ఇప్పటివరకు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో.. ‘మినిస్టర్ కాన్సులర్ ఫర్ మేనేజ్‌మెంట్ అఫైర్స్’ హోదాలో పనిచేశారు. సీనియర్ ఫారిన్ సర్వీసు అధికారి అయిన ములిన్స్ మినిస్టర్ కాన్సులర్ హోదాలో ఉన్నారు. ఆయన ఇంతకుముందు థాయిలాండ్, వియత్నాం, హాంకాంగ్, ఇండొనేసియా తదితర దేశాల్లో ఫారిన్ సర్వీసు అధికారిగా పనిచేశారు. ఫారిన్ సర్వీసుకు సంబంధించి ఆయన ఇప్పటివరకు ఆరు అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు.