ఉన్నత విద్యాభ్యాసానికి కేరాఫ్ అడ్రస్ అమెరికా
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్య అభ్యసించడానికి అమెరికా కేరాఫ్ అడ్రస్‌గా మారిందని యూఎస్ కాన్సుల్ జనరల్ (హైదరాబాద్) మైఖేల్ ముల్లిన్స్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్‌లో గురువారం ‘స్టూడెంట్ వీసా డే’ నిర్వహించారు. ఈ ఒక్క రోజే దాదాపు 700 మందికిపైగా విద్యార్థులు వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అన్ని రకాల అర్హతలున్న విద్యార్థులకు అప్పటికప్పుడే వీసాలను ముల్లిన్స్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా వీసాలు పొందిన విద్యార్థులతో అమెరికాలో చదువుకున్న భారతీయ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు.
అనంతరం ముల్లిన్స్ మాట్లాడుతూ.. స్టూడెంట్ వీసా డే సందర్భంగా చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, ముంబైలో ఉన్న కాన్సులేట్ జనరల్ కార్యాలయాల్లో 4 వేల మంది విద్యార్థులు వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఒక్క హైదరాబాద్ కార్యాలయం నుంచే 700 మందికి పైగా విద్యార్థులు దరఖాస్తులు సమర్పించారని పేర్కొన్నారు. చైనా తర్వాత ఇండియా నుంచే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు యూఎస్‌ను ఆశ్రయిస్తున్నారని.. అక్కడ నైపుణ్యంతో కూడిన నాణ్యమైన విద్య, పేరుగాంచిన యూనివర్సిటీలు ఉండటమే కారణమని అన్నారు.
అమెరికాలో విద్య తీరు, సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం తదితర అంశాలపై అమెరికా పూర్వ విద్యార్థులతో త్వరలో ఇక్కడి వారికి అవగాహన కల్పిస్తామని కాన్సులర్ చీఫ్ జామ్సన్ ఫాస్ వెల్లడించారు. జూలై నెలాఖరున ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశాలున్నాయని చెప్పారు. గత ఐదేళ్లలో వీసా పొందేవారి సంఖ్య 80 శాతం పెరిగిందన్నారు. వీసాలు తీసుకుంటున్న వారిలో విద్యార్థులే అత్యధికమని చెప్పారు. కార్యక్రమంలో ఎన్‌ఐవీ చీఫ్ బ్రియాన్ సాల్వర్‌సన్, అసిస్టెంట్ పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ జెన్నిఫర్ గోల్డ్‌స్టీన్, యూఎస్‌ఈఎఫ్/ఎడ్యుయూఎస్‌ఏ రీజినల్ ఆఫీసర్ పియా బహదూర్ తదితరులు మాట్లాడారు.