యూఎస్ కాన్సుల్ జనరల్‌తో కేటీఆర్ భేటీ
వీసా విషయంలో తెలుగు విద్యార్థుల ఇబ్బందులపై చర్చ
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో తెలుగు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్‌కు ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయానికి వెళ్లి కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్‌తో చర్చించారు. ఈ సమస్య ఒక్క హైదరాబాద్ విద్యార్థులే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల విద్యార్థులది అని తెలిపారు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని ముల్లిన్స్ హామీ ఇచ్చారు.
విద్యార్థులు ప్రైవేటు ఏజెంట్ల మోసానికి గురి కాకుండా, యూఎస్-ఇండియా ఎడ్యుకేషన్ ఫెయిర్‌లను పటిష్టంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. తెలుగు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు లేఖ రాస్తానని పేర్కొన్నారు. అమెరికాలోని హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని కోరతానని చెప్పారు. సమస్య త్వరలోనే పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎంతో కాలంగా నకిలీ ధ్రువపత్రాలు సృష్టిస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల డాక్యుమెంట్లను అమెరికాలో కాకుండా ఇక్కడ తనిఖీ చేశాకే వీసాలు మంజూరు చేయాలని యూఎస్ కాన్సులేట్‌కు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. తెలుగు విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించిన అమెరికా అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.