
పోలీసు విభజనకు సీనియర్ ఐపీఎస్‌లు
ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ అనురాగ్‌శర్మ
సాక్షి, హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పోలీసు విభజనకు సంబంధించి డీజీపీ అనురాగ్‌శర్మ వేగం పెంచారు. పోలీస్ స్టేషన్ల పరిధి, సిబ్బంది విభజన తదితర అంశాలను పరిష్కరించేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారులను రంగంలోకి దింపారు. జిల్లాల్లో ఎస్పీలుగా పనిచేసి, జిల్లా పోలీసింగ్‌పై పూర్తి అవగాహన ఉన్న అధికారులను జిల్లాల ఇన్‌చార్జిలుగా నియమించారు. మెదక్-కృష్ణప్రసాద్, రంగారెడ్డి-ఎం.గోపీకృష్ణ, నల్గొండ-రవిగుప్త, ఖమ్మం-అంజనీకుమార్, ఆదిలాబాద్-సందీప్ శాండిల్య, మహబూబ్‌నగర్-కె.శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్-సౌమ్యామిశ్రా, నిజామాబాద్-సంజయ్‌కుమార్‌జైన్, వరంగల్-బి.మల్లారెడ్డిలకు బాధ్యతలు అప్పగిస్తూ అనురాగ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
వీరందరూ జిల్లాల విభజన పనుల్లో ప్రస్తుత జిల్లా ఎస్పీలకు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. జిల్లాల సబ్‌డివిజన్లు, ఠాణాల పరిధి తదితర అంశాలను చర్చించనున్నారు. అలాగే జిల్లా స్థాయిలో జరిగిన కానిస్టేబుళ్ల నియామకాలు, జోనల్ స్థాయిలో జరిగిన సబ్‌ఇన్‌స్పెక్టర్ల రిక్రూట్‌మెంట్ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోనున్నారు.