
ఉద్యోగాల భర్తీకి పునర్విభజన చిక్కు
కొత్త జిల్లాల ప్రకారం పోస్టుల విభజనకు మరింత సమయం
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం చేస్తున్న కసరత్తు నిరుద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇప్పటికే జారీ చేసిన గ్రూపు-2 పోస్టుల భర్తీ, కొత్త నోటిఫికేషన్లు... అంతా అస్తవ్యస్తమవుతుందనే ఆందోళనను కలిగిస్తోంది. జిల్లాల పునర్విభజనలో హద్దులు చెదిరిపోతే.. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సైతం నిలిచిపోయే ప్రమాదం ఉందని, న్యాయపరమైన చిక్కులు తప్పవనే సంకేతాలు లక్షలాది మంది అభ్యర్థులను మనోవేదనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసిన 439 పోస్టులు, త్వరలో రాబోయే మరో 460 గ్రూపు-2 పోస్టుల భర్తీ పరిస్థితి ఏంటన్న అంశంపై గందరగోళం నెలకొంది. వీటి కి జోనల్ సమస్యలుండగా, 15,628 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి జిల్లా సమస్యలు అడ్డంకిగా మారే అవకాశాలున్నాయి.
జిల్లాల ఏర్పాటుకు ముందే చేపట్టాలి...
గ్రూపు-2కు దరఖాస్తు చేసిన 5,64,434 మంది నిరుద్యోగులు, ఇప్పటికే టెట్ అర్హత పొందిన లక్షన్నర మంది, కొత్తగా టెట్ రాసిన 3.72 లక్షల మంది ఉద్యోగాల భర్తీకి ఎదురు చూస్తున్నారు. పాఠశాలల హేతుబద్దీకరణ పూర్తి కాగానే ఉపాధ్యాయ ఖాళీలు, సీఎం ఆమోదం రాగానే అదనపు గ్రూపు పోస్టులతో ఉద్యోగాల భర్తీని టీఎస్‌పీఎస్సీ చేపడుతుందని భావించినా కొత్త జిల్లాల కసరత్తుతో ఆ ప్రక్రియకు బ్రేక్ వేసినట్లయింది. ఈ కసరత్తుతో ఉద్యోగాల భర్తీ ఇప్పట్లో సాధ్యం కాదని, జిల్లాల ఏర్పాటు కంటే ముందే ఉద్యోగాల భర్తీ చేపడితేనే న్యాయం జరుగుతుందని నిరుద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి నెలా వేల రూపాయలు వెచ్చించి కోచింగ్ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు.. ఉద్యోగాల భర్తీ మరింత ఆలస్యం అయితే తీవ్ర అప్పుల్లో కూరుకుపోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
రెండు కొత్త జిల్లాలతో జోనల్ సమస్య!
ఇప్పటివరకు ఐదో జోన్‌లో ఉన్న వరంగల్‌లోని మూడు మండలాలు, ఆరో జోన్ పరిధిలోని నల్గొండలో 11 మండలాలను కలిపి కొత్తగా యాదాద్రి జిల్లాను ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. దీంతో గ్రూపు-2 పోస్టుల భర్తీలో జోనల్ సమస్య తలెత్తనుంది. ఆరో జోన్‌లో ఉన్న మెదక్ జిల్లాలోని 12 మండలాలు, ఐదో జోన్‌లోని కరీంనగర్ జిల్లాలో ఉన్న 5 మండలాలు, అలాగే ఐదో జోన్‌లోనే ఉన్న వరంగల్ జిల్లాలోని 4 మండలాలతో సిద్దిపేట జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించింది. గ్రూపు-2కు తమ జోన్ పరిధిలో ఉన్న పోస్టులకు అనుగుణంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ జోన్లు మారితే ఈ పోస్టుల భర్తీ గందరగోళమవనుంది.
టీచర్ పోస్టుల భర్తీలో ఎన్నో సమస్యలు...
టీచర్ తదితర జిల్లా స్థాయి పోస్టుల భర్తీ విషయంలో అనేక సమస్యలు తలెత్తే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం ఖాళీలు భర్తీ చేయకపోతే అందుకు మరింత సమయం పడుతుంది. కొత్త జిల్లాల ప్రతిపాదనలను చూస్తే ఒక జిల్లాలోని మండలాలన్నీ అదే జిల్లా పరిధిలో లేవు. ఉదాహరణకు వరంగల్ , కరీంనగర్ జిల్లాల్లోని వివిధ మండలాలతో ఆచార్య జయశంకర్ జిల్లా ప్రతిపాదన ఉంది. ఇప్పటివరకు ఏ జిల్లా పోస్టులు ఆ జిల్లా యూనిట్‌గానే భర్తీ చేశారు. కానీ కొత్త జిల్లాల పరిధిలోకి వచ్చే మండలాల్లోని ఖాళీలను మాత్రమే తీసుకొని నోటిఫై చేయాల్సి వస్తుంది. ఇందుకు చాలా సమయం పట్టనుంది.
పైగా జిల్లాలు ఏర్పడితేనే పోస్టుల విభజన చేయాల్సి ఉంటుంది. అంతవరకు పోస్టులను విభజించి భర్తీ చేయడానికి వీల్లేదు. ఈ లెక్కన పోస్టుల భర్తీలో కూడా ఆలస్యం తప్పేలా లేదు. ఏజెన్సీ ప్రాంతాలున్న ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ వంటి ప్రాంతాల్లో మరో సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఉదాహరణకు ఖమ్మం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ పోస్టులు 66 ఖాళీగా ఉన్నాయి. అందులో మైదాన ప్రాంతంలో 60 పోస్టులు ఖాళీగా ఉంటే ఏజెన్సీ మండలాల్లోని పాఠశాలల్లో 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం అనుకున్నట్లుగా భద్రాద్రిని జిల్లా చేస్తే అక్కడున్న ఆరు పోస్టులకే ఆయా మండలాలకు చెందిన అభ్యర్థులంతా పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.