
‘ఎవరెస్టు’కు చేరువలో గ్రామీణ విద్యార్థులు
మెహిదీపట్నం, న్యూస్‌లైన్: ఆ ఇద్దరు గ్రామీణ విద్యార్థులు.. వారి లక్ష్యం మాత్రం ఎవరెస్టు.. దాన్ని ఛేదించే దిశగా పయనిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ప్రపంచంలోనే ఎత్తై ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే దిశగా సాగుతున్నారు. ఏప్రిల్ 4వ తేదీన నగరం నుంచి బయలుదేరిన ఈ ఇద్దరు విద్యార్థులు ప్రస్తుతం ఎవరెస్టు శిఖరం బేస్ క్యాంప్ నుంచి 21,300 అడుగుల ఎత్తుకు చేరుకున్నట్లు వారి సాహసయాత్రను పర్యవేక్షిస్తున్న ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ గురువారం ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్), ఫ్రాన్స్ అడ్వెంచర్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా తాడ్వాయి గ్రామానికి చెందిన మాలావత్ పూర్ణ స్వేరోస్, ఖమ్మంజిల్లా చార్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన ఎస్.ఆనంద్‌కుమార్ అన్నపురెడ్డిపల్లిలో ఉన్న ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌లో ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. పర్వతారోహణ అంటే మక్కువ ఉన్న వీరు అర్జున అవార్డు గ్రహీత, ప్రముఖ పర్వతారోహణుడు, ట్రైనర్ శేఖర్‌బాబు నేతృత్వంలో ఈ సాహసయాత్ర సాగిస్తున్నారు. వీరితో పాటు ప్రస్తుతం అక్కడ వివిధ దేశాలకు చెందిన 47 మంది సాహసయాత్ర దిశగా సాగుతున్నారు.
కఠినమైన శిక్షణ తీసుకున్న ఈ విద్యార్థులు దాదాపు ఎవరెస్టు శిఖరానికి చేరువలో ఉన్నట్లు తెలిపారు. ఎవరెస్టు శిఖరానికి ఉత్తరం వైపు ఉన్న డెత్ జోన్‌ను అధిగమించగలిగితే వీరు దాదాపు ఎవరెస్టు శిఖరం అధిరోహించినట్లే. వీరి సాహసయాత్ర షెడ్యూల్ ప్రకారం జూన్5తో ముగిసే అవకాశం ఉన్నట్లు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. వీరు ఎవరెస్టు శిఖరం అధిరోహిస్తే పూర్ణ స్వేరోస్, అత్యంత పిన్నవయస్కురాలిగా ప్రపంచ రికార్డు నెలకొల్పే అవకాశం ఉందని ప్రవీణ్ కుమార్ తెలిపారు.