హైవేల కోసం రాష్ట్ర భూసేకరణ విధానం!
కేంద్రానికి ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం
- కేంద్ర విధానం వల్ల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని ఫిర్యాదు
- పరిహారం పెరిగితే ఆ మొత్తాన్ని కేంద్రమే భరించాలని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారుల నిర్మాణంలో స్పీడు పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల భూసేకరణలో జాప్యం ఏర్పడుతోందని అభిప్రాయపడుతోంది. వాటికి బదులుగా రాష్ట్ర నిబంధనలను రూపొంది స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండు వేల కిలోమీటర్ల మేర కొత్త జాతీయ రహదారులకు అనుమతులు పొందిన విషయం తెలిసిందే. హైవేలను వేగంగా నిర్మించేవిధంగా రూపొందించిన రాష్ట్రప్రభుత్వ భూసేకరణ నిబంధనలకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్రానికి లేఖ రాసింది. కేంద్ర విధానాలను అనుసరిస్తే జాతీయ రహదారుల నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదని పేర్కొంది. కొత్త భూసేకరణ విధానం వల్ల పరిహారం చెల్లింపు పెరిగితే దాన్ని కేంద్రమే భరించాలని కోరడం కొసమెరుపు.
ఆ రోడ్డును చూడండి...
హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిని 4 వరసలుగా మార్చే పని ఏళ్ల క్రితం మొదలైంది. అతి కష్టమ్మీద హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట రోడ్డు కలిసే వరకు ఈ పనులు పూర్తయ్యాయి. అక్కడి నుంచి వరంగల్ వరకు పనులు జరగాల్సి ఉంది. ఏడాది క్రితమే టెండర్లు పిలిచి ఎల్ అండ్ టీకి పనులు అప్పగించారు. గత ఫిబ్రవరిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వచ్చి శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటి వరకు నిర్మాణ సంస్థతో అగ్రిమెంటు కూడా జరగలేదు. ఈ రోడ్డు విస్తరణకు భారీగా భూమిని సేకరించాల్సి ఉంది. కానీ కేంద్రప్రభుత్వం ఇచ్చే పరిహారానికి స్థానికులు అంగీకరించటం లేదు. దీనిపై కోర్టుల్లో పెద్ద సంఖ్యలో కేసులు దాఖలయ్యాయి.
ఫలితంగా రోడ్డు నిర్మాణ పనులు ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదు. ఈ దుస్థితిని రాష్ట్రప్రభుత్వం తాజాగా కేంద్రం ముందుంచింది. సాగునీటి ప్రాజెక్టు పనుల్లో జాప్యం లేకుండా చేసేందుకు భూసేకరణ చట్టాన్ని మార్చామని, దీంతో ప్రాజెక్టుల నిర్మాణంలో ఊపు వచ్చినందున జాతీయ రహదారుల నిర్మాణం కోసం భూసేకరణకూ రాష్ట్రప్రభుత్వ విధానాన్నే అనుసరించాలని నిర్ణయించినట్టు కేంద్రానికి తెలి పింది. దీనిపై కేంద్రమంత్రితో చర్చించేం దుకు త్వరలోనే రోడ్లు భవనాల శాఖ మంత్రి, అధికారులు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది.