అంతిమయాత్రలో ఉద్రిక్తత
{పగతి కళాశాలలోకి దూసుకెళ్లి విద్యార్థులు
పూలకుండీలు, కిటికీ అద్దాలు, కారు ధ్వంసం
అశ్రునయనాలతో హర్షవర్ధన్ అంత్యక్రియలు
సుల్తాన్‌బజార్/ అఫ్జల్‌గంజ్ : సీనియర్ విద్యార్థి దాడిలో మృతి చెందిన హర్షవర్ధన్‌రావు అంతిమయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థినిని ర్యాగింగ్ చేయొద్దన్న పాపానికి హనుమాన్ టేకిడీలోని ప్రగతి మహావిద్యాలయ కళాశాలలో రాంకోఠికి చెందిన హర్షవర్ధన్‌పై సతీష్‌కోడ్కర్ అనే విద్యార్థి దాడి చేయడంతో శనివారం మృతి చెందిన విషయం తెలిసింది. ఆదివారం ఉదయం ఉస్మానియాలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. తోటి విద్యార్థులు పెద్ద సంఖ్యలో మార్చురీ వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా... తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు మృతదేహాన్ని చూసి బోరుమన్నారు. కొద్ది సేపటి తర్వాత అంతమయాత్ర ప్రారంభమైంది.
కళాశాలలోకి తోసుకెళ్లిన విద్యార్థులు...
అంతిమయాత్రలో వందలాది మంది విద్యార్థులు, బంధువులు పాల్గొన్నారు. యాత్ర ప్రగతి మహావిద్యాలయ కళాశాల వద్దకు చేరుకోగానే విద్యార్థులు ఉద్విగ్నానికి లోనయ్యారు. హర్షవర్ధన్ అమర్‌హై... కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు కళాశాల ప్రధాన గేట్లకు తాళాలు వేశారు. కనీసం హర్షవర్ధన్ మృతదేహాన్ని చూడటానికి కూడా కళాశాల యాజమాన్యం రాకపోవడంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న విద్యార్థులు కళాశాల గేట్లను తోసుకొని లోపలికి దూసుకెళ్లారు.
వందల సంఖ్యలో ఉన్న విద్యార్థులను పదుల సంఖ్యలో ఉన్న పోలీసులు అదుపు చేయలేకపోయారు. దీంతో విద్యార్థులు కళాశాల కిటికీ అద్దాలతో పూలకుండీలు, అక్కడ పార్క్ చేసిన ఉన్న ఓ కారు అద్దాలను ధ్వంసం చేశారు. మృతదేహాన్ని కాలేజీ వద్ద ఉంచి కొద్దిసేపు నినాదాలు చేశారు. మృతుడి బంధువులు సముదాయించడంతో విద్యార్థులు ఆందోళన విరమించి అంతిమయాత్రను కొనసాగించారు. అనంతరం పురానాపూల్ శ్మశానవాటికలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు.
పలువురి పరామర్శ...
హర్షవర్ధన్ కుటుంబ సభ్యులను అంతకు ముందు టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సి.కృష్ణయాదవ్, టీఆర్‌ఎస్ గోషామహల్ నియోజకవర్గం ఇన్‌ఛార్జి ప్రేమ్‌కుమార్‌దూత్, టీఆర్‌ఎస్ నాయకురాలు పడాల లలిత తదితరులు పరామర్శించారు.
పోలీసుల అదుపులో నిందితుడు
హర్షవర్ధన్‌పై దాడి చేసి అతడి మృతికి కారణమైన సీనియర్ విద్యార్థి సతీష్ కోడ్కర్‌ను సుల్తాన్‌బజార్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అతడిని రహస్య ప్రాంతానికి తరలించి, అసలు హర్షవర్ధన్‌పై ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందనేది తెలుసుకుంటున్నట్టు తెలిసింది. అయితే, సతీష్ అరెస్ట్‌ను సుల్తాన్‌బజార్ పోలీసులు ధ్రువీకరించలేదు. నిందితుడిని సోమవారం లేదా మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.