
ఇక సొరంగ మార్గం..!
- దుర్గంచెరువు కేబుల్ స్టే బ్రిడ్జి చివరి నుంచి ఖాజాగూడ వరకు సొరంగ మార్గం
- ఎస్సార్‌డీపీలో జాప్యంతో ప్రత్యామ్నాయంగా నిర్మాణానికి యోచన
- నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు
- సమగ్ర అధ్యయన నివేదిక రూపొందించనున్న జీహెచ్‌ఎంసీ అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్సార్‌డీపీ)లో భాగంగా పలు స్కైవేలు, రహదారుల విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అరుుతే ఇది కార్యరూపం దాల్చడంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించేందుకు ప్రత్యా మ్నాయ మార్గాల వైపు ప్రభుత్వం దృష్టి సారించింది. దుర్గం చెరువుపై వేలాడే వంతెన(కేబుల్ స్టే బ్రిడ్జి) నిర్మాణానికి ఇప్పటికే రూ.184 కోట్లు మంజూరు చేసింది. ఈ వంతెన ముగిసే ఇనార్బిట్ మాల్ దగ్గరి నుంచి ఖాజాగూడ జంక్షన్ వరకు ఉన్న గుట్ట ప్రాంతంలో దాదాపు 300 మీటర్ల మేర సొరంగ మార్గం ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. తద్వారా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్లేవారికి ఎంతో సమయం కలసి వస్తుందని భావిస్తోంది.
సొరంగ మార్గానికి సంబంధించి సమగ్ర అధ్యయన నివేదిక సిద్ధం చేయాల్సిందిగా ఇప్పటికే సంబంధిత అధికారులకు సూచించింది. ఇటీవల మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు నిర్వహించిన సమీక్షా సమావేశం సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు రావడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు దీనిపై దృష్టి సారించారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 నుంచి దుర్గం చెరువు వంతెన వరకు ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ వేకు ప్రణాళికలు రూపొందించాల్సిందిగా మంత్రి ఇప్పటికే ఆదేశించారు. దీంతోపాటు దుర్గం చెరువు కేబుల్ వే బ్రిడ్జి, సొరంగమార్గం రెండూ అందుబాటులోకి వస్తే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వైపు నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్లే వారు మాదాపూర్, గచ్చిబౌలి మీదుగా కాకుండా దుర్గం చెరువుపై వేలాడే వంతెన, అక్కడి నుంచి సొరంగమార్గం ద్వారా వెళ్లవచ్చు. తద్వారా అతి తక్కువ సమయంలో రోడ్ నంబర్ 45 నుంచి ఎలివేటెడ్ కారిడార్ మీదుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు వెళ్లవచ్చనేది అధికారుల అంచనా. దీని వల్ల ప్రయాణ సమయం కలసి రావడంతోపాటు రోడ్ నంబర్ 36, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు. దీనితోపాటు మెహిదీపట్నం నుంచి లింగంపల్లి(వయా నల్లగండ్ల) వరకు, జేఎన్‌టీయూ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు బీఆర్‌టీఎస్ ఏర్పాటు ఆలోచనలు కూడా ఉన్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.
కేబీఆర్ పరిసరాల్లో 120 అడుగుల రోడ్లు
కేబీఆర్ చుట్టూ ఉన్న వివిధ రహదారులను విస్తరించేందుకు కూడా అధికారులు సిద్ధమయ్యారు. కేబీఆర్ పరిసరాల్లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36, ఫిల్మ్‌నగర్ రోడ్లు 120 అడుగుల వెడల్పుతో ఉన్నప్పటికీ, రోడ్ నంబర్ 92 మార్గం అంతటా 120 అడుగులు లేదు. కొన్ని చోట్ల వంద అడుగులే ఉంది. అలాగే జూబ్లీహిల్స్ రోడ్ నం 45, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12, 10, 14, 2 రోడ్లు 80 అడుగులు ఉన్నారుు. వీటన్నింటినీ 120 అడుగులకు విస్తరించడం ద్వారా ఈ మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని భావిస్తున్నారు. ఇందుకు అవసరమైన భూసేకరణ తదితర అంశాలపై అధికారులు దృష్టి సారించారు.