టీచర్ పోస్టుల భర్తీలో రెండు రకాల విద్యార్హతలు!
- గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి అవే నిబంధనలు
- 2007కు ముందు ఓసీలకు 45 శాతం మార్కులు
- ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 శాతం మార్కులుంటే చాలు
- 2007 తర్వాత ఓసీలకు 50% మార్కులు ఉండాల్సిందే
- ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 శాతం మార్కులు చాలు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాల్లో పాటిం చాల్సిన విద్యార్హత నిబంధనలపై విద్యాశాఖ కసరత్తు వేగవంతం చేసింది. ఇప్పటికే గురుకుల పాఠశాలల్లో 7,600 టీచర్ పోస్టుల భర్తీకి అనుసరించాల్సిన నిబంధ నలపై జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) మార్గదర్శకాలను ప్రభుత్వానికి అందజే సింది. తాజాగా పాఠశాల విద్యాశాఖ పరిధిలోని 7,892 పోస్టుల భర్తీకి అనుసరించాల్సిన నిబంధనలపై కసరత్తు చేస్తోంది. ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారం 2007కు ముందు ఇంటర్మీడియెట్, డిగ్రీ పూర్తి చేసిన ఓసీ అభ్యర్థులు బీఎడ్ పూర్తి చేయడంతోపాటు ఆయా కోర్సుల్లో 45 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 40 శాతం చాలు. 2007 తరువాత ఇంటర్మీడియెట్, డిగ్రీ ఉత్తీర్ణులైన ఓసీ అభ్యర్థులు బీఎడ్ పూర్తి చేయడంతో పాటు ఆయా కోర్సుల్లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే 45 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనలను ఖరారు చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) వంటి గురుకుల టీచర్ పోస్టుల భర్తీలోనూ ఇవే నిబంధనలను అమలు చేయాలని దీని కోసం ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిసింది. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) వంటి ఉపాధ్యాయ శిక్షణ కోర్సుల్లో ఉత్తీర్ణులైతే చాలని, ఎలాంటి మార్కుల నిబంధన అవసరం లేదని గురుకుల పోస్టుల కోసం అందజేసినట్లు సమాచారం.
పాఠశాల విద్యాశాఖ పరిధి లోని స్కూళ్లలో టీచర్ పోస్టులకు కూడా ఇవే నిబంధనలు ఉండేలా చర్యలు చేపడుతోంది. మరోవైపు గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి అనుసరించాల్సిన రెండంచెల పరీక్ష విధానం (ప్రిలిమ్స్, మెయిన్స్) కాకుండా పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి వేరుగా పరీక్ష విధానం రూపొందించే అంశంపై కసరత్తు చేస్తోంది. జనరల్ స్టడీస్ వంటి సబ్జెక్టులు లేకుండా, విద్యా పాఠ్య ప్రణాళికలు, నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం పరీక్ష విధానాన్ని రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. త్వరలోనే దీనిపై ఓ స్పష్టత రానుంది. స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు వేరుగానే పరీక్ష విధానం ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.