నిషిత్ కారు వేగంగా నడపడం ఇది నాలుగోసారి
హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. ప్రమాధాలు నివారించండి.. సాధరణంగా ట్రాఫిక్ పోలీసులు సామాన్య పౌరులకు అర్థమయ్యే రీతిలో ఈ నినాదంతో ప్రచారం చేయడంతోపాటు అక్కడక్కడా రాసి ఉంచుతుంటారు. అయితే, ట్రాఫిక్ నిబంధనలు అంటే కేవలం కూడళ్ల వద్ద సిగ్నల్ లైట్లను మాత్రమే పట్టించుకోవడం అని కాదు.. కార్లను నడిపే విధానం కూడా అందులో భాగం అని మరువకూడదు.. అలా మరిచి ప్రమాదాలు కొని తెచ్చుకోరాదు. మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణకు ముందు నుంచే కారు వేగంగా నడిపే అలవాటు ఉందని తెలుస్తోంది.
గతంలో కూడా ఆయన వేగంగా కారు నడిపినందుకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా కూడా విధించారు. ఒక్క ఈ ఏడాదిలోనే అతి వేగం కారణంగా నిషిత్‌కు జరిమానా వేశారు. ఈ ఏడాది తొలిసారి జనవరి 24, 2017న గండిపేట వద్ద 150 కిలోమీటర్ల వేగంతో నిషిత్ కారు నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల స్పీడ్ గన్ కెమెరాలకు చిక్కారు. అందులో ఆయన కారు వేగం 150 కిలోమీటర్లుగా చూపించింది. అలాగే, మార్చి 1, 2017న మరోసారి గండిపేట వద్ద అదే 150 కిలోమీటర్ల వేగంతో, మార్చి 10, 2017న మాదాపూర్ ఔటర్ రింగ్ రోడ్‌లో అతివేగంతో కారు నడిపారు. అతి వేగం కారణంగా ఆయన నడిపిన కారు టీఎస్ 07 ఎఫ్‌కే7117 కారుపై రూ.4305 జరిమానాను ట్రాఫిక్ పోలీసులు వేశారు. తాజాగా జరిగిన ప్రమాదాన్ని బట్టి నిషిత్ కారు వేగంగా నడపడం ఇది నాలుగోసారి.