రియాజ్ @ ‘లవ్లీ హంక్’ | This - mail id exposed yasin Bhatkal | Sakshi
Sakshi News home page

రియాజ్ @ ‘లవ్లీ హంక్’

Published Mon, Sep 2 2013 1:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:21 PM

This - mail id exposed yasin Bhatkal

సాక్షి, సిటీబ్యూరో: బీహార్‌లోని భారత్-నేపాల్ సరిహద్దుల్లో చిక్కిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) కీలక ఉగ్రవాది యాసీన్ భత్కల్ విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)తో పాటు కేంద్ర నిఘాః వర్గాలు వేగవంతం చేశాయి. యాసీన్‌తో పాటు తబ్రేజ్‌ను ఢిల్లీ తరలించిన ఎన్‌ఐఏ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో అరెస్టు చూపించింది. కోర్టు అనుమతితో 12 రోజుల కస్టడీకి తీసుకుని విచారిస్తోంది.

విచారణలో ఎన్‌ఐఏతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)  పాలుపంచుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా యాసీన్ భత్కల్, తబ్రేజ్‌లు సృష్టించిన విధ్వంసాలు, వీరికి సహకరించిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. వీటన్నింటికీ మించి ఇప్పటికీ పరారీలోనే ఉన్న,  గోకుల్‌చాట్, లుంబినీపార్క్, దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లలో వాంటెడ్ ఐఎం కో-ఫౌండర్స్ రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్‌ల సమాచారం సేకరించడంపై దృష్టి పెట్టారు.

ఈ నేపథ్యంలోనే వారికి సంబంధించిన కీలక సమాచారం లభ్యమైంది. రియాజ్, ఇక్బాల్‌లు పాక్ నిఘా సంస్థ(ఐఎస్‌ఐ) ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా కనుసన్నల్లో పని చేస్తున్నారని, గతేడాది నుంచి కరాచీలోనే ఉంటున్నారని యాసీన్ బయటపెట్టాడు. అంతకు ముందు షార్జాలో ఉన్నారని, అయితే, అమెరికా  ఐఎంను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం, ఇంటర్‌పోల్ వేట ముమ్మరం కావడంతో ఐఎస్‌ఐ ఇరువురినీ కరాచీకి రప్పించిందని చెప్పాడు. కరాచీలోని మిలటరీ బేస్‌కు సమీపంలో ఉన్న రెసిడెన్షియల్ ప్రాంతంలో వీరి షెల్టర్ ఉందని, అక్కడి ఫేజ్-4 లో ఉన్న డిఫెన్స్ హౌసింగ్ కాలనీలో వీరిద్దరి కోసం ఐఎస్‌ఐ ఓ సేఫ్‌హౌస్‌ను కేటాయించిందన్నాడు.

పాక్ ఆర్మీ వీరికి కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తోందని యాసీన్ పేర్కొన్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న తమ అనుచరులు, స్లీపర్ సెల్స్‌తో రియాజ్ భత్కల్ ఈ-మెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపేవాడని యాసీన్ బయటపెట్టాడు. ‘లవ్లీహంక్ 34’ పేరుతో మెయిల్ ఐడీని సృష్టించి  గతేడాది నుంచి దాని ద్వారా అటు ఐఎస్‌ఐ, ఎల్‌ఈటీ సంబంధీకులతో పాటు అనుచరులతోనూ సంప్రదింపులు జరుపుతున్నాడని యాసీన్ వెల్లడించాడు.

ఐఎం ఇప్పటి వరకు విధ్వంసాలకు వినియోగించిన బాంబుల్లో అమోనియం నైట్రేట్‌నే పేలుడు పదార్థంగా వినియోగించింది. దీన్ని యాసీన్ భత్కల్ కర్ణాటకలో సేకరించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. 2007లో అక్కడి కుడేర్‌గుండి నుంచి ట్రక్కు అమోనియంను ఓ రహస్య ప్రాంతానికి రవాణా చేశాడు. దేశవ్యాప్తంగా జరిగిన దాదాపు 30 పేలుళ్లలో దీన్నే వాడాడు. ఈ పేలుడు పదార్థం సేకరణ, రవాణా, భద్రపరచడం వంటి అంశాలపై  నిఘా వర్గాలు యాసీన్‌ను ప్రశ్నిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement