ఈ ఏడాది ఎల్లంపల్లి ఫుల్!
20 టీఎంసీల నీటిని నింపాలని ప్రభుత్వ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈ ఏడాది పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టు పరిధిలో గ్రామాల తరలింపు ప్రక్రియ పూర్తి కావడం, ప్రధాన అడ్డంకిగా ఉన్న రాయపట్నం బ్రిడ్జి పనులు ముగియడంతో 20 టీఎంసీలు నిల్వ చేయాలని కృత నిశ్చయంతో ఉంది. బేసిన్‌లో కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే ప్రాజెక్టులో 7 టీఎంసీల మేర నీరు చేరింది. ప్రస్తుతం 25 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. ఇలాగే ప్రవాహాలుంటే మరో 15 రోజుల్లో ప్రాజెక్టు నిండుతుందని అధికారులు ఆశిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో 1,85,700 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, ఆదిలాబాద్ జిల్లాలోని 30 వేల ఎకరాల స్థిరీకరణ కోసం 20.17 టీఎంసీల సామర్థ్యంతో ఎల్లంపల్లి బ్యారేజీని నిర్మించారు.
ప్రాజెక్టు కింద మొత్తంగా 21 గ్రామాలు ముంపునకు గురవుతుండగా ఇందులో ఇప్పటివరకు 12 గ్రామాల తరలింపు పూర్తయింది. మరో 9 గ్రామాల్లో 700 ఇళ్లను ఖాళీ చేయించాల్సి ఉంది. గతేడాది ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో బ్యారేజీలో కేవలం 6.5 టీఎంసీల నీటి నిల్వకు మాత్రమే అవకాశం ఏర్పడింది. అనంతరం ముంపు గ్రామాల్లో ఒకటిగా ఉన్న తాళ్లకొత్తపేట గ్రామాన్ని ఖాళీ చేయించడంతో 144 మీటర్ల ఎత్తులో 10 టీఎంసీ మేర నిల్వ చేయగలిగారు. ఈ నీటితోనే హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చారు. ప్రస్తుతం సహాయ పునరావాస ప్రక్రియ కొలిక్కి రావడంతో 20.18 టీఎంసీల మేర నిల్వ చేసే అవకాశం లభించింది. ప్రాజెక్టులో 7 టీఎంసీల నీరు రాగా.. ఎగువన కడెం గేట్లు ఎత్తడంతో భారీగా నీరు వచ్చి చేరుతోంది.
మధ్య, చిన్న తరహా ప్రాజెక్టుల్లోకి వరద
భారీవర్షాలకు మధ్య, చిన్నతరహా ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాలకు 4,647 క్యూసెక్కులు, స్వర్ణకు 6,223.45, వట్టివాగుకు 4,202, సుద్దవాగుకు 14 వేలు, మత్తడివాగుకు 7,415, నీల్వాయికి 2,556 క్యూసెక్కుల ప్రవాహాలు నమోదవుతున్నాయి. ఇదే జిల్లాలోని కొమరంభీంకు 3,608 క్యూసెక్కుల ప్రవాహాలుండగా, ఖమ్మం జిల్లాలోని తాలిపేరుకు 14,564 క్యూసెక్కుల ప్రవాహాలున్నాయి. భారీ ప్రాజెక్టుల్లో కడెంకు ఎగువ నుంచి 57,696 క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తుండగా.. శ్రీరాంసాగర్‌లోకి 14,031 క్యూసెక్కుల నీరు వస్తోంది.