
సాక్షి, హైదరాబాద్: కడెం ప్రాజెక్టు కింది ఆయకట్టుకు సమృద్ధిగా నీటి లభ్యతను పెంచే లక్ష్యంతో కుఫ్టి బహుళార్థ్ధ సాధక ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ, ఇచ్చోడ మండలాల మధ్య కుఫ్టి గ్రామం వద్ద 5.32 టీఎంసీల సామర్ధ్యంతో రూ.870 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు అనుమతిచ్చింది. అలాగే, లోయర్‌పెన్‌గంగ నదిపై మరో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తారు. రూ.369 కోట్లతో 1.42 టీఎంసీల సామర్థ్యంతో పిప్పల్‌కోటి, రూ.215 కోట్లతో 0.7 టీఎంసీల సామర్థ్యంతో గోముత్రి రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతిచ్చింది.
ఈ మేరకు సీఎస్ ఎస్‌కే జోషి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కడెం నదిపై ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు నిర్మించిన విషయం తెలిసిందే. దీనికి 13.42 టీఎంసీల నీటి కేటాయింపులుండగా 7.2 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో 4 టీఎంసీలే వాడుకుంటుండగా మిగతా 3 టీఎంసీలు డెడ్ స్టోరేజీగా ఉంది. దీంతో 4 టీఎంసీలతో 68,150 ఎకరాలకు నీరివ్వాలనే లక్ష్యం ఉన్నా కేవలం 41,868 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. మరో 26,282 ఎకరాలు గ్యాప్ ఆయకట్టుగా ఉంది.
ఈ నేపథ్యంలో కుఫ్టి రిజర్వాయర్ నిర్మించాలని కడెం కింది ఆయకట్టుకు నీటి లభ్యతను పెంచే లక్ష్యంతో దీన్ని చేపట్టనుంది. కుఫ్టి ప్రాజెక్టును చేపట్టడం ద్వారా కుంటాల జలపాతానికి ఏడాది పొడవునా నీటి లభ్యతను ఉంచడం ద్వారా పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. దీంతోపాటే ఇక్కడ 3 మెగావాట్ల హైడ్రో పవర్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే, సమీప గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా ఏడాదంతా నీటిని అందించే అవకాశం ఉందని ఉత్తర్వుల్లో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment