రైతులకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం: తుమ్మల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు, రైతులకిచ్చిన మాట నిలబెట్టుకుంటామని, వారికి ఎప్పటికీ ద్రోహం చేయబోమని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. ఒకవేళ మాట తప్పాల్సిన పరిస్థితి ఎదురైతే ఉరి వేసుకుంటామన్నారు. శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజే శ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, పురాణం సతీశ్‌తో కలసి ఆయన గురువారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మాట్లాడారు.
కాంగ్రెస్.. రైతు పరామర్శ యాత్ర, సీపీఎం.. మహాజన పాదయాత్రలు చేస్తామంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు రోడ్లెక్కకుండా సకాలంలో అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కోతల్లేని కరెంటు ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణను వ్యతిరేకించి, పార్లమెంటులో తెలంగాణ ఇచ్చి తప్పు చేశారని ఇటీవల పార్లమెంటులో అన్న సీపీఎం ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేపడుతుందన్నారు.
క్షమాపణ చెప్పి పాదయాత్ర చేయండి: పల్లా
రాష్ట్ర ప్రజల కోసం సీపీఎం ఏనాడూ సానుకూలంగా ఆలోచించలేదని పల్లా రాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు. ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే మహాజన పాదయాత్ర చేపట్టాలని హితవు పలికారు.