సాక్షి, హైదరాబాద్: కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్ల బిల్లు, పీడీ యాక్ట్ సవరణకు సంబంధించిన బిల్లులపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ ప్రత్యేక సమావేశం ఏర్పా టు చేసింది. శుక్రవారం హోం శాఖ అదనపు కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ సమావేశం జరగనుంది. పెండింగ్‌లో ఉన్న బిల్లులకు సంబందించి కేంద్రం కోరిన వివరణలు, సమగ్ర ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
ముస్లిం, గిరిజన రిజర్వేషన్లు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది పంపిన బిల్లుపై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముస్లిం రిజర్వేషన్లను (బీసీ–ఈ కోటా) 4 శాతం నుంచి 12 శాతానికి, ఎస్టీలకు 6 నుంచి 10 శాతా నికి పెంచేందుకు రూపొందించిన బిల్లును అసెం బ్లీ ఆమోదించింది. కేంద్రం పెండింగ్‌లో పెట్టింది. ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు నిలిపేయాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ హోం శాఖకు సూచించింది.
మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రధాన కారణం గా చూపింది. ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి రాష్ట్రం పంపిన బిల్లులోని అంశాల ను కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సమర్థించిం ది. రెండు శాఖలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయటంతో రిజర్వేషన్ల పెంపు విషయంలో పీట ముడి పడింది. అలాగే పీడీ యాక్ట్‌ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది.
శుక్రవారం జరిగే సమావేశంలో పెండింగ్ బిల్లులపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ఆసక్తికరంగా మారింది. బిల్లులకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు, కేంద్రం లేవనెత్తిన అంశాలను నివేదించేందుకు సాధారణ పరిపాలన శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కానున్నారు. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులపై ఈ సమావేశంలో చర్చించనుంది. తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలను సైతం సమావేశానికి ఆహ్వానించింది.
Comments
Please login to add a commentAdd a comment