ఆటలకు టాటా..బడిబాట | Today, the schools re-start | Sakshi
Sakshi News home page

ఆటలకు టాటా..బడిబాట

Published Sun, Jun 12 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM

ఆటలకు టాటా..బడిబాట

ఆటలకు టాటా..బడిబాట

నేడు పాఠశాలలు పున:ప్రారంభం
బడి గడప తొక్కనున్న   15 లక్షల  మంది విద్యార్థులు
పంపిణీకి సిద్ధంగా ఉచిత పుస్తకాలు
సర్కారు స్కూళ్లలో సమస్యలతో  స్వాగతం

 

వేసవి సెలవులు ముగిశాయి..బడి గంట మోగింది. ఆట పాటలు...విహార యాత్రలకు ఫుల్‌స్టాప్ పెట్టి విద్యార్థులు సోమవారం నుంచి బడిబాట పట్టనున్నారు. దాదాపు 50 రోజులపాటు రిలాక్స్‌గా ఉన్న తల్లిదండ్రులు  ఇక పిల్లల విద్యాభ్యాస హడావుడిలో మునిగితేలనున్నారు. కొత్త విద్యాసంవత్సరానికి వెల్‌కం చెప్పేందుకు పాఠశాలలు, కళాశాలలు  సన్నద్ధమయ్యాయి. ప్రైవేట్ స్కూళ్ల మాట అటుంచితే..సర్కార్ యథావిధిగా సమస్యల మధ్యే మళ్లీ తెరుచుకోబోతున్నాయి.   - సాక్షి సిటీబ్యూరో

 


సిటీబ్యూరో: ఇన్నాళ్లు ఆట పాటలు, తాత, అమ్మమ్మ, నానమ్మలతో హాయిగా గడిపిన విద్యార్థులు బడిబాట పట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు. వేసవి సెలవుల తర్వాత పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు అడుగులు వేస్తున్నారు. సోమవారంతో అడుగిడుతున్న కొత్త విద్యా సంవత్సరంలో ఎప్పటిలాగే అన్ని పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు చెందిన దాదాపు 15 లక్షల మంది బడి గడప తొక్కనున్నట్లు అంచనా. నాలుగైదు రోజుల క్రితమే కొన్ని ప్రైవేటు స్కూళ్లు పునఃప్రారంభించగా.. మిగిలినవి 13న తెరచుకోనున్నాయి.


సమస్యల లోగిళ్లలో సర్కారు స్కూళ్లు
హైదరాబాద్ జిల్లాలో 688, రంగారెడ్డి జిల్లాలో 2,250 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో అధిక శాతం పాఠశాలల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా సమస్యలు పేరుకపోయాయి. మరుగుదొడ్లు, మూత్రశాలలకు మరమ్మతులు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు వస్తున్నాయి. మరికొన్ని బడుల్లో సౌకర్యాలు ఉన్నా వినియోగించుకోవడానికి నీటి కొరత సమస్యగా మారింది. నీరు లేకపోవడంతో ఇవి అలంకారప్రాయంగా మారి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. చాలా పాఠశాలలకు ప్రహరీలు, మౌలిక వసతులు కరువయ్యాయి. వేసవిలో ఈ పనులు చేపట్టాల్సి ఉండగా.. ఒక్క అడుగూ ముందుకు పడలేదు. నాలుగు రోజుల క్రితం చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా తూతూమంత్రంగా పనులు చేశారు. ఇవి తాత్కాలికమే. ఏడాదంతా వీటి నిర్వహణ ఏంటన్న ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. తాగునీటి వసతికి నోచుకోని స్కూళ్లు వందల సంఖ్యలో ఉన్నాయి. పాఠశాలల్లో తరగతి గదులను ఊడ్చే వారే కరువయ్యారు. స్వీపర్లు లేకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే అన్నట్లుగా బడులు దర్శనమిస్తున్నాయి. నైట్ వాచ్‌మెన్‌లూ దిక్కులేరు. ఈ క్రమంలో నూతన విద్యా సంవత్సరంలో బడుల్లో అడుగుపెట్టే విద్యార్థులకు ఎప్పటిలాగే సమస్యలు స్వాగతం పలకనున్నాయి.

 
పుస్తకాలు సిద్ధం..

హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు 13.52 లక్షలు, రంగారెడ్డి అర్బన్ ప్రాంతంలోని స్కూళ్లకు 11.02 లక్షల ఉచిత పాఠ్య పుస్తకాలు ఈ విద్యాసంవత్సరానికి అవసరం. ఈ మొత్తం 24.54 లక్షల పుస్తకాల్లో దాదాపు 23 లక్షల పుస్తకాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇప్పటికే ఆయా స్కూళ్లకు చేర్చారు. వీటిని పాఠశాలలు పునఃప్రారంభమైన రోజు నుంచే విద్యార్థులకు అందజేస్తామని అధికారులు చెప్పారు. మరో పక్క ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కోసం నిర్దేశిత ధరతో పాఠ్య పుస్తకాలను అధీకృత దుకాణాలకు ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆథరైజ్డ్ దుకాణాలు మాత్రమే వీటిని ఎమ్మార్పీ ధరలకు విక్రయించాల్సి ఉంటుంది.

 
మరింత ప్రణాళికాబద్ధంగా..

విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి మరింత ప్రణాళికాబ్ధంగా, పకడ్బందీగా ముందుకు వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నామని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈఓలు సోమిరెడ్డి, రమేష్‌లు వెల్లడించారు.  90 శాతానికి పైగా పుస్తకాలు బడులకు చేరాయని తెలిపారు.



తొలిసారి  బడికి ఇలా.....  బడి వయసు రాకముందే....
అందరూ బడికి వెళ్లే తొలిరోజు భయపడితే...నేను మాత్రం బడి వయసు రాకముందే స్కూళ్లో అడుగుపెట్టా. ఏడ్చి మరీ అక్కతో కలిసి పాఠశాలకు వెళ్లా. 3 వ తరగతి నుంచి పీజీ వరకు...కేవలం ఎనిమిది రోజులే క్లాస్‌లకు గైర్హాజరయ్యా. చదువంటే నాకు అంత ఇష్టం మరి...
  -డాక్టర్ జనార్దన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్

 

అమ్మతో కలిసి వెళ్లా...
చిన్నప్పుడు...మొదటిసారి అమ్మతో కలిసి స్కూల్‌కెళ్లా. బడికి వెళ్లేందుకు నేను ఎప్పుడూ భయపడలేదు. మా ఇంట్లో ఎక్కువగా స్టడీ బేస్డ్ చర్చలు జరిగేవి. మా ఫ్యామిలీలో అందరూ విద్యావంతులు కావడంతో నాకు ఎడ్యుకేషన్‌పైన మొదటి నుంచీ ఆసక్తి పెరిగింది...

- రాహుల్ బొజ్జా,   హైదరాబాద్ జిల్లా కలెక్టర్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement