శివారే.. సవాల్! | Total 3486 polling stations in Cyberabad | Sakshi
Sakshi News home page

శివారే.. సవాల్!

Published Thu, Jan 21 2016 5:14 AM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

శివారే.. సవాల్!

శివారే.. సవాల్!

♦ సైబరాబాద్‌లో మొత్తం 3486 పోలింగ్ స్టేషన్లు
♦ 1422 సమస్యాత్మకంగా గుర్తింపు
♦ పటిష్ట ఏర్పాట్లు చేస్తున్న కమిషనరేట్ అధికారులు
♦ బందోబస్తు విధులకు 17 వేల మంది సిబ్బంది
 
 సాక్షి, సిటీబ్యూరో:
 నగరంలో కంటే శివార్లలోనే ఎన్నికల నిర్వహణ సవాల్‌గా మారింది. సిటీ చుట్టూ విస్తరించి ఉన్న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 3486 పోలింగ్ స్టేషన్లు ఉండగా... వీటిలో దాదాపు సగం సమస్యాత్మక జాబితాలోనే ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో ఉన్న వ్యాపార, స్థిరాస్తి వ్యవహారాల నేపథ్యంలో పోటీలో ఉన్న ప్రతి ఒక్కరికీ అర్ధ, అంగబలాలు ఎక్కువే. పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి కీలకమైన ఈ ప్రాంతాల్లో పట్టుకోసం ‘సీటు’ సాధించాలనే పట్టుదల ప్రతి ఒక్కరిలోనూ ఉంటోంది. ఈ పరిణామాలను సవాల్‌గా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు ఎన్నికల బందోబస్తు కోసం 17 వేల మంది సిబ్బందిని వినియోగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కమిషనర్ సీవీ ఆనంద్ అవసరమైన మార్పుచేర్పులు సూచిస్తున్నారు.

 నగరానికి పూర్తి భిన్నంగా...
 కోర్ సిటీలో చేసే బందోబస్తు, భద్రతా ఏర్పాట్లకు... చుట్టూ విస్తరించి ఉన్న సైబరాబాద్(శివారు ప్రాంతాలు)లో తీసుకునే చర్యలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. సువిశాలమైన పరిధి, విసిరేసినట్లు ఉండే కాలనీలు, నిర్మానుష్య ప్రాంతాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేయడం, పోటీలో ఉన్న వాళ్లు ఎరవేసే ప్రలోభాలను అడ్డుకోవడం పెనుసవాల్ లాంటిదే. మూడు వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న సైబరాబాద్ కమిషనరేట్‌లో 12 జీహెచ్‌ఎంసీ సర్కిళ్లు ఉన్నాయి. వీటిలో 64 డివిజన్ల పరిధిలో ఎన్నికలు జరుగనున్నాయి. వీటికి సంబంధించి 1077 పోలింగ్ సెంటర్లలో 3486 పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి.


 కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలింగ్‌స్టేషన్లను అధ్యయనం చేసిన పోలీసు విభాగం వీటిలో 1422 సమస్యాత్మకంగా ఉన్నట్లు తేల్చారు. గత చరిత్ర, పోటీలో ఉండే ప్రధాన పార్టీల అభ్యర్థులు, వారి బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటూ ఈ జాబితా రూపొందించారు. సాధారణ పరిస్థితులు ఉండే పోలింగ్ స్టేషన్, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ పోలింగ్‌స్టేషన్... ఇలా నాలుగు రకాలుగా విభజించుకుని బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొత్తం ఐదు జోన్లు ఉండగా... క్రిటికల్ కేటగిరీ కిందికి వచ్చే పోలింగ్‌స్టేషన్లు కేవలం శంషాబాద్ జోన్‌లోనే ఉన్నాయి. సెన్సిటివ్ పోలింగ్‌స్టేషన్లు ఎల్బీనగర్ జోన్‌లో, హైపర్ సెన్సిటివ్ మల్కాజ్‌గిరిలో ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు.

 అదనపు బలగాలు 11 వేలు...
 సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న 7619 మంది సిబ్బందిలో రొటీన్ విధుల కోసం 30 శాతం మందికి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నారు. మిగిలిన 5334 మందికి అదనంగా మరో 11 వేల మందిని ఇతర విభాగాలు, జిల్లాల నుంచి కోరుతూ డీజీపీ కార్యాలయానికి ప్రతిపాదనలు పంపారు. కమిషనరేట్ వ్యాప్తంగా 253 రూట్ మొబైల్స్, 65 స్ట్రైకింగ్ ఫోర్స్ పనిచేస్తాయి.
 
 బందోబస్తు ఏర్పాట్లు ఇవీ...
 
►{పతి పోలింగ్ స్టేషన్‌లో క్యూ నిర్వహణకు కానిస్టేబుల్, ఓ అధికారి
► ఒకే బిల్డింగ్‌లో ఉన్న సాధారణ కేటగిరీ కిందికి వచ్చే ఒక పోలింగ్‌స్టేషన్‌కు ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు అధికారులు
► ఒకే బిల్డింగ్‌లో రెండు పోలింగ్‌స్టేషన్లు ఉంటే ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు అధికారులు
► ఒకే బిల్డింగ్‌లో మూడు పోలింగ్‌స్టేషన్లు ఉంటే ముగ్గురు కానిస్టేబుళ్లు, ముగ్గురు అధికారులు
► క్రిటికల్ పోలింగ్‌స్టేషన్ల వద్ద ఒక ఎస్సై, పదిమంది సాయుధ పోలీసులు
► హైపర్ సెన్సిటివ్ పోలింగ్‌స్టేషన్ వద్ద ఎస్సై,  ఐదుగురు సాయుధులు
► సెన్సిటివ్ పోలింగ్‌స్టేషన్ వద్ద హెడ్-కానిస్టేబుల్,ఇద్దరు కానిస్టేబుళ్లు
► స్ట్రైకింగ్ ఫోర్స్‌లో ఐదుగురు సిబ్బంది
► స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌లో ఏడుగురు
► బోర్డర్ చెక్‌పోస్టుల్లో ఎస్సై, ఆరుగురు సిబ్బంది
► ఫ్లయింగ్ స్క్వాడ్‌లో ఏఎస్సై, హెడ్-కానిస్టేబుల్,ఇద్దరు కానిస్టేబుళ్లు
► స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లో ఏఎస్సై, హెడ్-కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement