పట్టణాల్లో ‘భగీరథ’కు గ్రీన్ సిగ్నల్
పీపీపీ విధానంలో 35 పురపాలికల్లో పనులు
సాక్షి, హైదరాబాద్: ఇంటింటికీ తాగునీటి సరఫరా కోసం చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులను పట్టణ ప్రాంతాల్లో సైతం ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జీహెచ్‌ఎంసీ మినహాయిస్తే.. రాష్ట్రంలోని 35 నగరాలు, పట్టణాల్లో రూ.2,296.38 కోట్ల అంచనా వ్యయంతో ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్య పద్ధతిలో మిషన్ భగీరథ పనులను చేపట్టేందుకు పరిపాలనా అనుమతులిచ్చింది. సీఎం కేసీఆర్‌తో పాటు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంబంధిత ప్రతిపాదనపై సంతకం పెట్టడంతో ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు రానున్నాయి. రాష్ట్ర పురపాలక శాఖ పరిధిలోని పబ్లిక్ హెల్త్, మునిసిపల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతాయి.
రాష్ట్రంలోని మొత్తం 68 నగరాలు, పట్టణాలకుగాను జీహెచ్‌ఎంసీ, నగర శివారు ప్రాంతాల్లో జలమం డలి ఆధ్వర్యంలో... సిద్దిపేట మునిసిపాలిటీ సహా కొత్తగా ఏర్పడిన 32 నగర పంచాయతీల్లో గ్రామీణ నీటిసరఫరా విభాగం ఆధ్వర్యంలో మిషన్ భగీరథ కింద పనులు జరుగుతున్నాయి. మిగిలిన 35 నగరాలు, పట్టణాల్లో పనులను మాత్రమే పబ్లిక్ హెల్త్, మునిసిపల్ ఇంజనీరింగ్ విభాగం చేపట్టబోతోంది.
పీపీపీలో పనులు...
35 నగరాలు, పట్టణాల్లో రూ.2,296.38 కోట్ల అంచనా వ్యయంతో మిషన్ భగీరథ పనులు చేపట్టనుండగా.. అందులో రూ.636 కోట్లు కేంద్రం నుంచి రానున్నా యి. ‘అమృత్’ పథకం కింద ఎంపికైన 10 పట్టణాల్లో నీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మా ణం కోసం ఈ నిధులను కేంద్రం విడుదల చేస్తుంది. మిగిలిన రూ.1,660.38 కోట్ల వ్యయాన్ని రాష్ట్రం భరిస్తుంది. పీపీపీ పద్ధతిలో ఈ ప్రాజెక్టు పనులను దక్కించుకునే సంస్థే తొలుత పెట్టుబడి పెట్టి రెండేళ్లలో పనులు పూర్తి చేయాలి. ఆతర్వాత 6 ఏళ్లలో ప్రభుత్వం ఆరు నెలలకోసారి వాయిదాల పద్ధతిలో ఈ మొత్తాన్నీ సదరు సంస్థకు చెల్లిస్తుంది.
మూడు ప్యాకేజీలుగా పనులు
పట్టణ మిషన్ భగీరథ పనులను ప్రభుత్వం మూడు ప్యాకేజీలుగా విడగొట్టింది. ప్యాకేజీ-1 కింద కరీంగనర్ జిల్లాలోని కరీంనగర్, కోరుట్ల, మెట్‌పల్లి మునిసిపాలిటీలతోపాటు ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాల్వంచ, ఇల్లెందు మునిసిపాలిటీల్లో రూ.701.52 కోట్లతో పనులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్యాకేజీ-2 కింద ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, మందమర్రి, మం చిర్యాల మునిసిపాలిటీలు, వరంగల్ జిల్లాలోని వరంగల్ కార్పొరేషన్, జనగాం మునిసిపాలిటీల్లో రూ.874.3 కోట్ల పనులకు ఆమోదం తెలిపింది. ప్యాకేజీ-3 కింద తాండూరు, వికారాబాద్,నల్లగొండ, భువనగిరి, మిర్యాలగూడ, సూర్యాపేట, సదాశివపేట,సంగారెడ్డి, జహీరాబాద్, బోధన్, కామారెడ్డి, నిజామాబాద్, గద్వాల్, వనపర్తి, నారాయణ్‌పేట్, మహబూబ్‌నగర్ మునిసిపాలిటీల్లో రూ.720.56 కోట్లతో పనులు చేపట్టనున్నారు.