రూ.2 కోట్ల ‘కిక్’ వదిలింది!
సాక్షి, హైదరాబాద్: మద్యం సేవించి నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఇలాంటి ‘నిషా’చరుల్లో పలువురికి జైలు శిక్షలూ పడ్డాయి. జనవరి నుంచి అక్టోబర్ 20 వరకు మద్యం సేవించి వాహనాలు నడిపిన వారు జరిమానాల రూపంలో ఖజానాకు మొత్తం రూ.2,01,17,100 సమర్పించారు. ఈ ఏడాది ఇప్పటివరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌ల్లో 13,447 మంది చిక్కారని ట్రాఫిక్ చీఫ్ జితేందర్ శుక్రవారం తెలిపారు. వీరిలో 6,245 మందికి ఎర్రమంజిల్‌లోని కోర్టులు శిక్షలు విధించాయని వెల్లడించారు. ఇప్పటివరకు 10,065 ద్విచక్ర, 983 త్రిచక్ర, 2,115 తేలికపాటి వాహనాలతో పాటు 284 ఇతర వాహనాలను పట్టుకున్నట్లు చెప్పారు.
వీటి చోదకులకు కౌన్సెలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు ఎర్రమంజిల్‌లోని మూడు, నాల్గో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుల్లో హాజరుపరిచారు. చోదకులు తీసుకున్న మద్యం మోతాదును పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానాలు ఒక రోజు నుంచి 20 రోజుల వరకు జైలు శిక్షలు విధించాయి. 582 మందికి ఒక రోజు, 1,161 మందికి రెండు రోజులు, 544 మందికి మూడు రోజులు, 227 మందికి నాలుగు రోజులు, 189 మందికి ఐదు రోజులు, 33 మందికి ఆరు రోజులు, 136 మందికి వారం, 138 మందికి పది రోజులు, 161 మందికి 15 రోజులు, ముగ్గురికి 20 రోజుల చొప్పున శిక్షలు పడ్డాయని జితేందర్ తెలిపారు. మరో 3,071 మందికి కోర్టు సమయం ముగిసే వరకు న్యాయస్థానంలోనే నిలబడేలా, సామాజిక సేవలు చేసేలా కోర్టులు శిక్ష విధించాయన్నారు.