నగరం వెలుపలే నిలిచిపోతున్న రైళ్లు | trains are halted city outside itself | Sakshi
Sakshi News home page

నగరం వెలుపలే నిలిచిపోతున్న రైళ్లు

Published Wed, Nov 6 2013 2:08 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

trains are halted city outside itself

 సాక్షి, సిటీబ్యూరో :  
 విశాఖ నుంచి హైదరాబాద్ ఆగమేఘాల మీద పయనమయ్యాడు హరీష్. హైటెక్‌సిటీలోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఐదంకెల జీతంతో కూడిన ఉద్యోగం వచ్చింది తనకు. కల నెరవేరబోతోందని సంతోషంగా విశాఖ ఎక్స్‌ప్రెస్ ఎక్కేశాడు. హైదరాబాద్ నగర శివార్ల వరకు ఎలాంటి బ్రేకులు లేకుండా పట్టాలపై వాయువేగంతో పరుగులు తీసిన ఆ ట్రైన్‌కు ఘట్కేసర్ నుంచే బ్రేకులు మొదలయ్యాయి. ఆగుతూ, సా..గుతూ రైలు కదులుతోంది. ఉదయం 10 గంటలకు తాను హెటెక్‌సిటీకి చేరుకోవాలి. చర్లపల్లి నుంచి నుంచి మౌలాలీ వరకు రావడానికే గంటకు పైగా గడిచింది. అప్పటికే ఉదయం 8 అయింది. మౌలాలీ సమీపంలో రైలు ఠకీమని ఆగిపోయింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫామ్ ఖాళీగా లేకపోవడంతో ఉదయం 8.30 వరకు ఆ ట్రైన్ అక్కడే నిలిపివేశారు. ట్రైన్ దిగి వెళ్లలేక, స్టేషన్‌కు చేరుకోలేక మిగతా ప్రయాణికులతో పాటు హరీష్ ఆ ట్రైన్‌లోనే పడిగాపులు కాయల్సి వచ్చింది. చివరకు అరగంటకు పైగా ఆలస్యంగా ఆ ట్రైన్ సికింద్రాబాద్ చేరుకుంది. దీంతో అతను సకాలంలో సదరు సాఫ్ట్‌వేర్ సంస్థకు చేరుకోలేకపోయాడు.
 
 ఉద్యోగం పోయి ఉస్సూరంటూ వెనుదిరిగాడు. ఇది ఒక్క హరీష్ సమస్యే కాదు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు సకాలంలో చేరుకోకపోవడం వల్ల ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు తీవ్ర బ్బందులు ఎదుర్కొంటున్నారు.  నగరానికి చేరుకొనే రైళ్లు ప్రతిరోజు నిర్ణీత సమయానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకోలేకపోతున్నాయి. ఉదయం ప్లాట్‌ఫామ్‌లపై రద్దీ కారణంగా చాలా రైళ్లను శివార్లలోనే నిలిపివేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర దుర్గంధాన్ని భరిస్తూ, సకాలంలో గమ్యం చేరుకోలేక రైళ్లలోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఉదయం 7.45 గంటలకు రావలసిన సింహపురి ఎక్స్‌ప్రెస్ 8.30 గంటలకు చేరుకుంటుంది. తెల్లవారుజామున 6.35 గంటలకే రావలసిన గౌతమి ఎక్స్‌ప్రెస్ అరగంట ఆలస్యంగా వస్తుంది. చెన్నై-హైదరాబాద్ చార్మినార్ ఎక్స్‌ప్రెస్, దురంతో, గరీబ్థ్.్ర. ఇలా వరుసగా అన్ని రైళ్లు నగర శివార్లలోనే నిలిచిపోతున్నాయి. వందల కొద్దీ కిలోమీటర్లు ప్రయాణం చేసి, గంటల కొద్దీ రైళ్లలో గడిపి, ఇప్పుడో ఇంకొద్ది సేపటికో స్టేషన్‌కు చేరుకుంటామనుకొనే ప్రయాణికులను ఆలస్యం తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.
 
 తీరని వ్యథ
 సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.. పది ప్లాట్‌ఫామ్‌లు.. ప్రతిరోజు లక్షా 50 వేల మంది ప్రయాణికుల రాకపోకలు.. వందల కొద్దీ రైళ్ల హాల్టింగ్.. ఉదయం నాలుగింటి నుంచే రైళ్ల  ఆగమనం.. ప్లాట్‌ఫామ్‌ల రద్దీ.. కానీ ఏ ఒక్క రైలూ సకాలంలో స్టేషన్‌కు చేరుకున్న దాఖలా కనిపించదు. ప్రతిరోజు 80కి పైగా ఎక్స్‌ప్రెస్‌లు, వంద ప్యాసింజర్ రైళ్లు, మరో 122 సబర్బన్, ఎంఎంటీఎస్ రైళ్లు సికింద్రాబాద్ కేంద్రంగానే నడుస్తాయి. పైగా ప్రతి సంవత్సరం 3 నుంచి 4 కొత్త రైళ్లు వచ్చి చేరుతున్నాయి. దీంతో ఉదయం  సాయంత్రం రద్దీ వేళల్లో వచ్చే రైళ్లు, వెళ్లే రైళ్లతో స్టేషన్‌పై ఒత్తిడి తారస్థాయికి చేరుకుంది. ఒక రైలు ప్లాట్‌ఫామ్ వదిలితే కానీ మరో రైలు స్టేషన్‌లోకి ప్రవేశించడం సాధ్యం కాదు. దీంతో చాలా రైళ్లు నగర శివార్లలోనో, సమీప స్టేషన్లలోనో నిలిచిపోతున్నాయి. ప్రయాణికులకు మాత్రం గమ్యస్థానానికి దగ్గర్లోనే ఉన్నట్లనిపిస్తుంది. కానీ ఎప్పుడు స్టేషన్‌కు చేరుకుంటారో తెలియని అనిశ్చితి. ఇక వాళ్ల కోసం స్టేషన్‌లో బంధుమిత్రుల పడిగాపులు. ఆపదలో ఉన్నవారికి, అత్యవసరమైన పనుల్లో వచ్చేవాళ్లకు  ఈ జాప్యం మరిన్ని కష్టాలను, బాధలను తెచ్చిపెడుతోంది.
 
 ఆచరణకు నోచని అభివృద్ధి
     సికింద్రాబాద్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు ఎయిర్‌లెవల్ కన్‌స్ట్రక్షన్స్ కట్టిం చి ప్లాట్‌ఫామ్‌లు పెంచాలని ప్రతిపాదించిన వరల్డ్‌క్లాస్ ప్రమాణాలు 2008 నుంచి ఆచరణకు నోచుకోలేదు. అంతర్జాతీయ విమానాశ్రయం తరహాలో స్టేషన్‌ను అభివృద్ధి చేసి ప్లాట్‌ఫామ్‌లు పెంచాలని ప్రతిపాదించారు.
     {పయాణికుల మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నట్లు పదేపదే ప్రకటించే దక్షిణమధ్య రైల్వే నగర శివార్లలోని రైల్వేస్టేషన్ల విస్తరణను మాత్రం విస్మరించింది.
 
     {పస్తుతం 2 ప్లాట్‌ఫామ్‌లు ఉన్న మౌలాలీ స్టేషన్‌లో నాలుగు ప్లాట్‌ఫామ్‌లు నిర్మించవచ్చు. దానివల్ల సైనిక్‌పురి, ఏఎస్‌రావునగర్, ఈసీఐఎల్, చర్లపల్లి తార్నాక, సీతాఫల్‌మండి, ఉప్పల్ తదితర ప్రాంతాల ప్రయాణికులకు ఊరట లభిస్తుంది. తద్వారా సికింద్రాబాద్‌పై ఒత్తిడి తగ్గుతుంది. కొన్ని రైళ్లను మౌలాలీ వరకే పరిమితం చేయవచ్చు.
 
     మల్కాజిగిరి స్టేషన్‌లో ప్రస్తుతం 3 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. మరో 3 ప్లాట్‌ఫామ్‌లు కట్టేందుకు కావలసిన స్థలం ఉంది. ఈ స్టేషన్‌లో మౌలిక సదుపాయాలు, అదనపు ట్రాక్‌ల నిర్మాణం వల్ల నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే రైళ్లను ఇక్కడ నిలిపేందుకు అవకాశం ఉంటుంది.
 
     హైటెక్‌సిటీలోని ఎంఎంటీఎస్ స్టేషన్‌ను అభివృద్ధి చేయడం వల్ల ముంబై మీదుగా వచ్చే రైళ్లను అక్కడ నిలిపేందుకు అవకాశం లభిస్తుంది.     ఈ ప్రతిపాదనలేవీ అమలుకు నోచుకోలేదు. ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement