పోస్టులు 206.. అభ్యర్థులు 47,246
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో)లో అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టుల భర్తీకి ఆదివారం రాత పరీక్ష జరుగనుంది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. మొత్తం 206 పోస్టుల కోసం 47,246 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎలక్ట్రికల్ కేటగిరీలో 184 పోస్టులకు 39,092 మంది (ఒక్కో పోస్టుకు 213 మంది), సివిల్ కేటగిరీలో 22 పోస్టులకు 8,154 మంది (ఒక్కో పోస్టుకు 371 మంది) అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.
హైదరాబాద్ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పరీక్ష కోసం... హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో 53 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలో అనుమతించబోమని ట్రాన్స్‌కో మానవ వనరుల విభాగం డెరైక్టర్ నర్సింగ్‌రావు తెలిపారు. పూర్తి పారదర్శకంగా పరీక్షను నిర్వహిస్తున్నామని, ఎలాంటి వదంతులను నమ్మవద్దని అభ్యర్థులకు సూచించారు. పరీక్ష అనంతరం అభ్యర్థులు జవాబు పత్రం (ఓఎంఆర్ షీట్) కార్బన్ కాపీతో పాటు ప్రశ్నపత్రాన్ని తీసుకుని వెళ్లాలని చెప్పారు.