సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేసులో ఉన్న సీనియర్ ఐఏఎస్‌లతోపాటు పలువురు సీనియర్లను ఏమాత్రం ప్రాధాన్యం లేని పోస్టులకు బదిలీ చేసింది. పలు జిల్లాల కలెక్టర్లను కూడా బదిలీ చేసింది. మొత్తంగా 25 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడంతోపాటు రాష్ట్రానికి కొత్తగా కేటాయించిన 2015 బ్యాచ్‌కు చెందిన మరో నలుగురు యువ ఐఏఎస్‌లకు తొలిసారి పోస్టింగ్‌లు కేటాయించింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పశుసంవర్థక, డెయిరీ అభివృద్ధి, మత్స్యశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సురేశ్‌చందాను రాష్ట్ర ఆర్థిక కమిషన్ సభ్య కార్యదర్శిగా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న బీఆర్ మీనాను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఇద్దరు సీనియర్ అధికారులకు కమిషన్ల కార్యదర్శుల బాధ్యతలు అప్పగించడం ఐఏఎస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
జాయింట్ సెక్రటరీ స్థాయి గల అధికారులకు కేటాయించే పోస్టులను వీరికి కేటాయించారని చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన మరో ఐఏఎస్ బీపీ ఆచార్యను సైతం ఇటీవల ప్రభుత్వం ప్రణాళిక శాఖ నుంచి తప్పించి ఎంసీహెచ్‌ఆర్డీకి పరిమితం చేసింది. తాజా బదిలీల్లో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీకి ప్రభుత్వం కీలకమైన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్‌ను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. అలాగే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో విభేదాల నేపథ్యంలో పలువురు జిల్లా కలెక్టర్లు సైతం బదిలీకి గురయ్యారు.
జనగామ జిల్లా కలెక్టర్ దేవసేన గతంలో స్థానిక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భూకబ్జాలపై బహిరంగంగా ఆరోపణలు చేయగా.. తాజాగా ఆమెను అక్కడ్నుంచి తప్పించి పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతి మీనా పట్ల ఇటీవల స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఆమెను సైతం ప్రభుత్వం బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. గిరిజనులు ఆరోగ్యంగా ఉండాలంటే అడవి పంది మాంసం, గొడ్డు మాంసం తినాలని గతంలో గిరిజన తండాల్లో ప్రచారం నిర్వహించిన భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మురళిని సైతం బదిలీ చేసింది. మెదక్ జిల్లా కలెక్టర్ భారతీ హొళికేరిని కూడా స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేతో ఉన్న విభేదాల నేపథ్యంలో బదిలీ చేశారన్న చర్చ జరుగుతోంది.
ఐఏఎస్‌లకు ‘బదిలీల’ షాక్!
Published Wed, Jan 3 2018 1:33 AM | Last Updated on Thu, Sep 27 2018 3:20 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment