సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 11, 12 తేదీల్లో పార్టీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించారు. ప్రతీ నియోజకవర్గానికి 200-250 మంది చొప్పున మొత్తం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 వేల మంది ముఖ్యులను ఈ ప్లీనరీ సమావేశాలకు ఆహ్వానించాలని ఆయన భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కొత్తగా ప్రవేశపెట్టబోయే ముఖ్య కార్యక్రమాలు, వాటి ఉద్దేశాలు, పార్టీ శ్రేణులు వ్యవహరించాల్సిన తీరుపై 2 రోజులపాటు వివరించాలని నిర్ణయించారు. సమావేశానికి రాష్ట్ర, జిల్లా పార్టీ ముఖ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, పార్టీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులను ఆహ్వానించనున్నారు. ఉపన్యాసకులుగా రిటైర్డు ఐఏఎస్‌లు, పార్టీ సీనియర్లు వ్యవహరించనున్నారు.