‘సీఎం అదృష్ట సంఖ్య కోసం జిల్లాలా?’
సాక్షి, హైదరాబాద్: జిల్లాల సంఖ్య ప్రజల అవసరాలు తీర్చడానికా లేక సీఎం కేసీఆర్ అదృష్ట సంఖ్య కోసమా అని టీటీడీపీ ప్రశ్నించింది. జిల్లాల విభజన పిప్పర్‌మెంట్ల పంపకాలను తలపిస్తోందని ఎద్దేవా చేసింది. తెలంగాణ ప్రజల బతుకు మారుస్తామని అధికారంలోకి రాగానే వాస్తు పేరుతో బంగ్లాలు, కలర్ల పేరుతో కార్లు మారుస్తూ, ఇప్పుడు అదృష్టసంఖ్య పేరుతో 20,26,27,30,33 జిల్లాలు అంటూ రోజుకో ప్రకటన చేస్తూ తుగ్లక్ పాలనను మరిపిస్తున్నారని ధ్వజమెత్తింది. బుధవారం ఆ పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. శాస్త్రీయ విధానం లేకుండా, రాజకీయ అవసరాలు, కుట్రలు, కుతంత్రాలతో ప్రత్యర్థులను దెబ్బతీయాలనే లక్ష్యంతో సీఎం వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు.
ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి: మోత్కుపల్లి
తెలంగాణ పోరాట యోధురాలు ఆరుట్ల కమలాదేవి పేరు మీద ఆలేరును రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. ఈ డివిజన్ ఏర్పాటుకు సహకరించాలని హైపవర్ కమిటీ చైర్మన్ కేశవరావుకు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి లేఖలు పంపుతున్నట్లు చెప్పారు.