డీపీఆర్‌లు లేకుండా టెండర్లు పిలవచ్చా?
టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తాము చేస్తున్న దోపిడి బయటపడుతుందన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు పాలమూరు, డిండి ప్రాజెక్టుల సవివరమైన నివేదికల (డీపీఆర్)ను కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డుకు ఇవ్వడం లేదని తెలంగాణ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టుకు రూ. 35 వేల కోట్లతో, డిండి ప్రాజెక్టుకు రూ. 6 వేల కోట్లతో టెండర్లు పిలిచారని చెప్పారు. ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌లు లేకుండానే టెండర్లు పిలవచ్చా అని ఆయన ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు చంద్రబాబు వ్యతిరేకి అంటూ కేసీఆర్ మందిమాగధులు ప్రచారం చేస్తున్నారన్నారు. నీటి లభ్యత లేకుండా కమీషన్లకు కక్కుర్తిపడి అడ్డగోలుగా ప్రాజెక్టులు నిర్మిస్తే ఎవరూ ఊరుకోరన్నారు.