సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో మహిళల అభివృద్ధి, శిశు సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం లేకుండా పోయిందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాదితో పోలిస్తే స్వల్ప పెరుగుదల ఉన్నా.. పెరిగిన ధరలను పోల్చుకుంటే ఈ బడ్జెట్‌తో పథకాల కొనసాగింపు కష్టమన్నారు. శుక్రవారం సచివాయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ కింద రూ.3 వేల కోట్లు కేటాయించారని, ఈ పథకం కింద పౌష్టికాహార పరిమాణం పెంచడంతో నిధులు సరిపోవన్నారు.
ప్రధానమంత్రి మాతృ వందన యోజన కింద బడ్జెట్ కేటాయింపులు తగ్గించడం బాధకరమన్నారు. కేంద్రం నిధులు భారీగా ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తూ మెరుగ్గా అమలు చేస్తోందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అంగన్‌వాడీ కేంద్రాలకు నూతన వేయింగ్ మిషన్లు, స్మార్ట్‌ఫోన్లు, సూపర్‌వైజర్లకు ట్యాబ్‌లు సమకూర్చాల్సి ఉందన్నారు. రాష్ట్రానికి 8 కొత్త సఖి కేంద్రాలను కేంద్రం మంజూరు చేసిందన్నారు.
ఇందులో సిద్దిపేట, మంచిర్యాల, నాగర్ కర్నూల్, జనగామ జిల్లాల్లో సొంత భవనాలున్న కేంద్రాలతో పాటు, యాదాద్రి, కామారెడ్డి, జగిత్యాల, భద్రాద్రి జిల్లాల్లో అందుబాటులో ఉన్న భవనాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో రాష్ట్రంలో కొత్తగా వచ్చిన వాటితో కలిపి మొత్తం 17 జిల్లాలకు సఖి కేంద్రాలు మంజూరయ్యాయని తెలిపారు. కొత్తగా ఏర్పడిన 21 జిల్లాల్లో ఐసీడీఎస్ సెల్ ఏర్పాట్లకు అనుమతి లభించిందన్నారు. సమావేశంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్, డైరెక్టర్ విజయేందిర, బాలలు, వికలాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment