నయీమ్ హతమైనా ఇంకా తగ్గని భయం?
నయీమ్ అరాచకాలపై స్పందించేందుకు వెనకడుగు వేస్తున్న బాధితులు
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ హతమైనా అతడి బాధితుల్లో ఇంకా భయం వెంటాడుతోందా..? అతడి అనుచరులను అరెస్టు చేస్తున్నా ఏ మాత్రం భరోసా కలగడం లేదా? ప్రస్తుత పరిస్థితులు ఈ సందేహాలకు బలాన్ని చేకూర్చేలా కనిపిస్తున్నాయి. నయీమ్ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, రాజకీయ నాయకుల అండతో చెలరేగిపోయిన నయీమ్ సృష్టించిన అనేక అరాచకాలు మరింతగా బహిర్గతమవుతూనే ఉన్నాయి.
ముఖ్యంగా రియల్‌ఎస్టేట్ రంగానికి సంబంధించి నయీమ్, అతని అనుచరులు పెద్ద ఎత్తున బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. నయీమ్ వ్యవహారం పై దర్యాప్తు చేస్తున్న సిట్ చీఫ్ వై.నాగిరెడ్డి.. బాధితులెవరైనా ధైర్యంగా ఫిర్యాదు చేయాల్సింగా సూచిస్తూ, 9440627218 నంబర్ ను ప్రకటించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రకటించా రు. కానీ ఈ నంబర్‌కు పెద్దగా ఫిర్యాదులు రావడం లేదని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. తొలి రోజు కేవలం 14 ఫిర్యాదులు మాత్రమే అందినట్లు తెలుస్తోంది. అవికూ డా చిన్నా చితకా అంశాలకు సంబంధించినవేనని సమాచారం. ప్రభుత్వం నుంచి తగిన భరోసా కలగకపోవడం వల్లే నయీమ్ బారినపడ్డ ‘పెద్ద’ వ్యక్తులు ఫిర్యాదు చేసేందుకు సంశయిస్తున్నట్లు చెబుతున్నారు.
కొనసాగుతున్న దర్యాప్తు..
నయీమ్ వ్యవహారంలో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 12కేసులు నమోదవగా,22 మందిని అరెస్టు చేశారు. నయీమ్ కుటుంబీకులు, సన్నిహితుల నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా లోతుగా అధ్యయనం చేస్తున్నారు. వందల సంఖ్యలో లభించిన భూముల డాక్యుమెంట్లకు సంబంధించి రెవెన్యూ అధికారుల సహాయంతో పరిశీ లిస్తున్నారు. నయీమ్ డైరీలో కొంత మంది అత్యున్నత స్థాయి కలిగిన వారి పేర్లున్నట్లు సమాచారం. నయీమ్ అనుచరులందరి వద్ద గన్స్, బుల్లెట్లు, డిటోనేటర్లు వంటి పేలుడు పదార్థాలు లభిస్తున్నాయి. నయీమ్‌తో కొంత మంది బడా రాజకీయ నేతలు, పోలీసు అధికారులు దిగిన ఫోటోలను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
నివ్వెరపోతున్న అధికారులు
నయీమ్ ఏర్పాటు చేసుకున్న నెట్‌వర్క్‌ను పరిశీలించిన సిట్ అధికారులు నివ్వెరపోతున్నారు. తన శత్రువులుగా భావించిన వారి కదలికలు, టార్గెట్ చేసిన వ్యక్తుల సమాచారం మొత్తం ఎప్పటికప్పుడు సేకరించేందుకు దాదాపు వెయ్యి మందిని ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది.