
‘ఉదయ్’పై తర్జనభర్జన
♦ కేంద్ర పథకంలో చేరే అంశంపై సీఎం సమాలోచనలు
♦ నేడు ఇంధన శాఖ అధికారులతో మరో సమావేశం
♦ చార్జీల పెంపును ప్రభావితం చేయనున్న సర్కారు నిర్ణయం
♦ ఉదయ్‌లో చేరితే వినియోగదారులపై తగ్గనున్న భారం
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక నష్టాలతో దివాళా తీసిన విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉజ్వల్ డిస్కం యోజన (ఉదయ్)’ లో చేరాలా? లేదా? అన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. దీనిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, ఇతర అధికారులతో సుదీర్ఘంగా చర్చించినా ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయారు. ఈ పథకంలో చేరితే తీవ్ర నష్టాల్లో ఉన్న ఉత్తర, దక్షిణ తెలంగాణ డిస్కంలకు ఊరట లభించినా రాష్ట్ర ప్రభుత్వంపై మాత్రం తీవ్ర ఆర్థిక భారం పడనుంది.
2015 మార్చి 31 నాటికి డిస్కంల నష్టాలు రూ.13,886 కోట్లకు ఎగబాకాయి. మరోవైపు ఉదయ్ పథకంలో రాష్ట్రం చేరితే 2015 సెప్టెంబర్ 30లోగా డిస్కంల నష్టాల్లో 75 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించాల్సి ఉంటుంది. 2015-16లోగా 50 శాతం నష్టాలను, 2016-17లో 25 శాతం నష్టాలను ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాల్సి రానుంది. ఈ నష్టాలు/రుణాలను ప్రభుత్వం తక్షణమే చెల్లించాల్సిన అవసరం లేకు న్నా సంబంధిత బ్యాంకులకు 10-15 ఏళ్ల కాలపరిమితితో బాండ్లను జారీ చేయాల్సి ఉంటుంది.
ఈ పథకంలో చేరినందుకు ప్రతిఫలంగా అసలు రుణంపై ఐదేళ్ల మారటోరియాన్ని కేంద్రం విధించనుంది. అదేవిధంగా రుణంపై అన్ని రకాల వడ్డీలను బ్యాంకులు మాఫీ చేయనున్నాయి. 2013 అక్టోబర్ 1 తర్వాత చెల్లించిన వడ్డీలను అసలు రుణంలో సర్దుబాటు చేయనున్నాయి. అయితే, ఈ పథకం డిస్కంలకు ప్రయోజనకరంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారనుంది. పథకంలో కొన్ని మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం సూచించినా కేంద్రం ఒప్పుకోలేదు. ఈ అంశంపై బుధవారం మళ్లీ సమావేశమై చర్చించాలని నిర్ణయించారు.
చార్జీల పెంపుపై ప్రభావం
ఉదయ్ పథకంపై నిర్ణయం తీసుకున్న తర్వాతే 2016-17కి సంబంధించి తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్)ను ఈఆర్‌సీలో సమర్పించాలని డిస్కంలు నిర్ణయించాయి. వాస్తవానికి గత నవంబర్‌తోనే ఏఆర్‌ఆర్‌ల గడువు ముగిసినా, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల దృష్ట్యా అప్పట్లో వాయిదా వేశారు. ఈసారి ఉదయ్ కోసం మళ్లీ ఈ నెల 15 వరకు గడువు కోరాలని నిర్ణయించినట్లు చర్చ జరుగుతోంది. డిస్కంల ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వచ్చే ఏప్రిల్ నుంచి భారీగా విద్యుత్ చార్జీలు పెంచక తప్పని పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ ఉదయ్‌లో చేరాలని నిర్ణయిస్తే మాత్రం కొంత వరకు వినియోగదారులపై చార్జీల భారం తగ్గనుంది.