ఆ వాటాను కేంద్రమే చెల్లిస్తుంది | Union Minister Dattatreya on New workers PF | Sakshi
Sakshi News home page

ఆ వాటాను కేంద్రమే చెల్లిస్తుంది

Published Sun, Jun 5 2016 12:55 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

ఆ వాటాను కేంద్రమే చెల్లిస్తుంది - Sakshi

ఆ వాటాను కేంద్రమే చెల్లిస్తుంది

కొత్త కార్మికుల పీఎఫ్‌పై కేంద్ర మంత్రి దత్తాత్రేయ
 
 సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల్లో కొత్తగా చేరే కార్మికుల పీఎఫ్(భవిష్య నిధి) సొమ్ముకు సంబంధించిన వాటాను ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వమే చెల్లించనుందని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ప్రకటించారు. అందుకోసం ఈపీఎఫ్‌వో నుంచి ప్రత్యేకంగా రూ.వెయ్యి కోట్లను కేటాయించినట్లు తెలి పారు. పరిశ్రమల యాజమాన్యాన్ని, కార్మికులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దత్తాత్రేయ ‘వికాస్ పర్వ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌కు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, రాష్ట్ర హోం, కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి ముఖ్యఅథితులుగా హాజరై ప్రారంభించారు.

అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ కనీస పింఛన్ రూ.200 నుంచి వెయ్యికి పెంచడం ద్వారా దేశవ్యాప్తంగా 50 లక్షల మందికి లబ్ధి చేకూరినట్లు చెప్పారు. బోనస్‌ను సవరించి రూ.10 వేల నుంచి 21 వేలకు పెంచామన్నారు. సీలింగ్ కూడా రూ.3,500 నుంచి 7 వేలకు పెంచినట్లు తెలిపారు. అయితే కొంత మంది పరిశ్రమల యాజమానులు ఈ విషయంలో కోర్టును ఆశ్రయించారని, కానీ తాము కార్మికుల పక్షాన నిలిచి సుప్రీంకోర్టు వరకైనా పోరాడుతామన్నారు.

ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు తగ్గుతున్నా.. కార్మికుల పీఎఫ్‌పై 8.8 శాతం వడ్డీ తగ్గకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ సాహసోపేత నిర్ణయం వల్ల 17.80 కోట్ల మంది కార్మికులకు లబ్ధి చేకూరిందన్నారు. కార్మికుల సామాజిక భద్రతను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల సేవలు ఉపయోగపడేలా ‘యూ విన్’ కార్డు తీసుకొచ్చామన్నారు. నైపుణ్యాభివృద్ధి పెంచడానికి 1,700 కోట్లు వెచ్చించి 82 లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. బీడీ కార్మికుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే కేంద్ర నిధులతో పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. దేశంలోని ప్రతీ కార్మికుడికి ఈఎస్‌ఐ వైద్య సేవలు అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.

 కార్మిక సంఘం ఉండాల్సిందే: నాయిని
 పరిశ్రమల్లో కార్మికుల గొంతు వినిపించేందుకు కచ్చితంగా యూనియన్ ఏర్పాటు చేయాల్సిందేనని మంత్రి నాయిని వ్యాఖ్యానించారు. కార్మికులకు కొన్ని కంపెనీలు కనీస వేతనం కూడా చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా వేతన సవరణ జరగలేదని, తాము త్వరలో కనీస వేతనాన్ని ప్రకటించబోతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని కొన్ని కంపెనీలు యూనియన్ల ఏర్పాటుకు అంగీకరించడం లేదని అలాంటి వాటిని తాము సహించబోమన్నారు.
 
 నిరుద్యోగ యువత దేశానికి ప్రమాదకరం: గవర్నర్
 నిరుద్యోగ యువత ఎక్కువగా ఉంటే అది దేశానికి ప్రమాదకరమని గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. ఇటీవలి కాలంలో కేంద్రం అనేక పథకాలను తీసుకొస్తోందని వాటిని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచిం చా రు. కేంద్ర కార్మికశాఖ ఇటీవలి కాలంలో తీసుకొస్తున్న సంస్కరణలు అద్భుతంగా ఉన్నాయన్నారు. పదవీ విరమణ పొంది న వారి వైద్య సేవల విషయంలో కార్మికశాఖ బాధ్యత తీసుకోవాలని కోరారు. అసంఘటిత రంగ కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలన్నారు. కార్మికుల శ్రేయ స్సు దృష్ట్యా ఈవినింగ్ స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేయాలన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement