రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు
ప్రభుత్వంపై ఉత్తమ్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: మల్లన్నసాగర్ భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని, రైతుల హక్కులను కాలరాస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. దీనిపై జాతీయ స్థాయిలోని రాజ్యాంగ, న్యాయ వేదికలపై పోరాటం చేస్తామని తెలిపారు. శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, జగ్గారెడ్డి, మల్లు రవి, శ్రవణ్‌కుమార్‌రెడ్డిలతో కలసి గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని ఉత్తమ్ ఆరోపించారు.
భూసేకరణ చట్టం-2013ను పట్టించుకోకుండా.. భూముల్లేని పేదలు, కూలీలకు పునరావాసం గురించి మాట్లాడకుండా.. రైతుల అభిప్రాయాలను తీసుకోకుండా.. పోలీసులను, రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం దౌర్జన్యానికి దిగుతోందని మండిపడ్డారు. రైతులకు అన్యాయం జరుగకుండా తాము అడ్డుకుంటే.. మంత్రి హరీశ్‌రావు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతులకు సాగునీటిని అందించాల్సిందేనని... అయితే దానికోసం రైతులు, కూలీలను నిరాశ్రయులు చేయడం ఎంత వరకు న్యాయమని ఉత్తమ్ ప్రశ్నించారు.
శనివారం గవర్నర్‌ను కలసి ప్రభుత్వ తీరుపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఈ నెల 12న మల్లన్నసాగర్ రైతులకు మద్దతుగా గజ్వేల్‌లో సంఘీభావ సభ నిర్వహిస్తామని తెలిపారు. 13, 14 తేదీల్లో రాష్ట్రపతిని కలసి రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘన, ప్రజాస్వామిక హక్కుల అణచివేతపై ఫిర్యాదు చేస్తామని.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామని ఉత్తమ్ వెల్లడించారు.
తెలంగాణలోనే ఉన్నమా?
‘‘రెవెన్యూ, పోలీసు అధికారులు మా ఊళ్ల మీద వేటగాళ్లలా పడుతున్నరు. ప్రశ్నించిన రైతుల మీద కేసులు పెడుతున్నరు. అడిగితే కొట్టిస్తున్నరు. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నమా అనిపిస్తున్నది..’’ అని మల్లన్నసాగర్ ముంపు గ్రామాల రైతులు ఎల్లారెడ్డి, మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. భూమి మీదే ఆధారపడిన తమకు దిక్కు చూపించకుండా వెళ్లిపొమ్మంటే ఎక్కడికిపోయి బతుకుతామని ప్రశ్నించారు. ప్రభుత్వం చెల్లిస్తున్న ధరకు భూములు ఎక్కడా దొరకడం లేదన్నారు.