ప్రజాస్వామ్య వ్యవస్థలు విధ్వంసం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉత్తమ్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేస్తు న్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, జె.గీతారెడ్డితో కలసి శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామిక, రాజ్యాంగ హక్కులన్నీ దేశవ్యాప్తంగా అణచివేతకు గురవుతున్నాయన్నారు. 2014 నుంచి దేశంలో మైనారిటీలు, దళితులకు రక్షణ లేదని, మీడియాపై ఆంక్షలు పెరిగాయని అన్నారు. మేధావులు, వృత్తి నిపుణులు రాజకీయాలకు దూరం కావడంతో ప్రజాస్వామిక విలువలకు అవరోధాలు వస్తున్నా యన్నారు.
రాజకీయాల్లోకి వృత్తి నిపుణులు ఎక్కు వగా రావాల్సి ఉందన్నారు. ఇందుకోసం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహల్‌గాంధీ నేతృత్వంలో ప్రొఫెష నల్స్ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేసినట్టుగా వెల్లడిం చారు. మండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ మాట్లాడు తూ.. అబద్ధాలాడటంలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లు పోటీ పడుతున్నారన్నారు. జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గుజరాతీ అని, ఆయన ఏడేళ్ల వయసులోనే స్వామి వివేకానందతో చర్చలు జరిపినట్టుగా మోదీ అస త్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. గీతారెడ్డి మా ట్లాడుతూ కాంగ్రెస్ పాలనలోనే ప్రజాహక్కులకు రక్షణ ఉందన్నారు. తనకు అప్పగించిన దక్షిణ భారత ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ బాధ్యతలను సమర్థ వంతంగా నిర్వహిస్తానన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఎన్‌ఆర్‌ఐ చైర్మన్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.
బీపీ, షుగర్ మాత్రమే సంపాదించుకున్నా..
‘రాజకీయాల్లోకి వచ్చి బీపీ, షుగర్‌లను మాత్రమే సంపాదించుకున్నా.. ఆస్తులు సంపాదించిందేమీ లేదు..’ అని ఉత్తమ్ చెప్పారు. శనివారం తనను కలసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు వస్తాయన్నారు. టీఆర్‌ఎస్‌లో కేసీఆర్ కుటుంబ సభ్యులు మినహా బలమైన నేతలెవరూ లేరని.. కాంగ్రెస్‌లో సొంతంగా గెలవగల వ్యక్తులు కనీసం 40 మందికిపైగా ఉన్నారన్నారు. దీనిపై తాను, పార్టీ అధిష్టానం వేర్వేరుగా సర్వే చేశామన్నారు. ఈ రెండు సర్వేల ఫలితాలు దాదాపుగా ఒకేలా ఉన్నాయన్నారు.