కోటి ఎకరాల మాట బూటకం
17న వాస్తవ సాగునీటి దృశ్యాన్ని ఆవిష్కరిస్తాం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్ : కొత్తగా కోటి ఎకరాలకు సాగునీటిని అందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెబుతున్న మాట వట్టి బూటకమని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 90 శాతం దాకా పూర్తిచేసిన ప్రాజెక్టుల సంగతిని దాచిపెడుతున్నారని అన్నారు. ఈ ప్రాజెక్టుల ఆయకట్టు కాకుండా ఇంకా కోటి ఎకరాలు తెలంగాణలో ఎక్కడుందో కేసీఆర్ చెప్పాలన్నారు. వాస్తవాలను దాచిపెట్టి, వక్రీకరించి, అబద్దాలను చెబుతున్నారని ఉత్తమ్ విమర్శించారు.రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు భూసేకరణ చట్టం-2013 ప్రకారం పునరావాసం కల్పించాలని కోరారు.
17న పవర్ ప్రజెంటేషన్...
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల వాస్తవ పరిస్థితిపై ఈ నెల 17న పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని ఉత్తమ్‌కుమార్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని రావి నారాయణరెడ్డి హాల్‌లో ఈ ప్రదర్శన ఉం టుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హయాం లో ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుదల, అందుకు తీసుకున్న చర్యలను వివరిస్తామన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఆయకట్టు తగ్గిందని, దీనిని జిల్లాల వారీగా అంకెలతో సహా నిరూపిస్తామని సవాల్ చేశారు.