ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
టీడీపీ తీరుపై వాసిరెడ్డి పద్మ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో అధికారపక్షమైన టీడీపీ పాల్పడిన అక్రమాలు, అరాచకాలు ప్రజాస్వామ్య చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతాయని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీకి చెందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మెజారిటీ స్థానాల్లో గెలుపొందిన చోట్ల కూడా టీడీపీ బరితెగించి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని.. తమ పార్టీకి చెందిన వారిని అపహరించడం, ప్రలోభాలకు, బెదిరింపులకు, ఒత్తిళ్లకు గురిచేయడం వంటి అక్రమాలకు పాల్పడిందని మండిపడ్డారు. వాసిరెడ్డి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.