తెలంగాణలో రాజకీయ శూన్యత
♦ బీజేపీ ఎదగడానికి ఇప్పుడు సానుకూల పరిస్థితులు
♦ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు
♦ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన కె.లక్ష్మణ్
♦ హాజరైన వెంకయ్య, దత్తాత్రేయ, మురళీధర్‌రావు, కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ శూన్యత ఏర్పడిందని, పార్టీ ఎదగడానికి ఇప్పుడు అత్యంత సానుకూల పరిస్థితులు ఉన్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కె.లక్ష్మణ్ బాధ్యతలను స్వీకరించిన అనంతరం పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ దేశంలో బీజేపీ పాలన చరిత్రాత్మక అవసరమన్నారు. తెలంగాణలో రాజకీయ శూన్యత పెరుగుతోందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం, కార్యకర్తల బలం కూడా ఉందన్నారు.
ఇప్పుడు నాయకులు కూడా అనుభవం, ఓపిక, శ్రమించేతత్వం ఉన్న వాళ్లున్నారని చెప్పారు. తెలంగాణలో నాయకుల సంఖ్య ఎక్కువగా ఉందని, వీరికి బాధ్యతలను అప్పగించి, వినియోగించుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. బీజేపీలో వారసత్వానికి అవకాశం లేదని, అందరికీ అధ్యక్షునిగా అవకాశం వస్తుందన్నారు. అధ్యక్ష బాధ్యతలు శాశ్వతం కాదని, అవకాశం ఉన్నంతకాలం అందరినీ కలుపుకునిపోవాల్సిన బాధ్యత ఉందని వెంకయ్య సూచించారు. గ్రామాల్లో బీజేపీ జెండా ఎగరాలని, నాయకులు హైదరాబాద్‌లో ఎక్కువగా కనిపించకుండా జిల్లాల్లో, గ్రామాల్లో కనిపించాలన్నారు. ప్రజల్లోనే కలసి ఉండాలని, వారితోనే కలసి భోజనాలు, నిద్రలు చేయాలని సూచించారు.
ప్రజలతో కలసి అధ్యయనం చేసి, సమస్యలకు పరిష్కారం అన్వేషించాలన్నారు. ఓట్ల కోసం మైనార్టీలను విభజించడానికి మజ్లిస్‌ను ఉపయోగించుకుని కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలకు పాల్పడిందని ఆరోపించారు. మైనారిటీల్లోకి చొచ్చుకుపోయి, పార్టీపై విశ్వాసం పొందాల్సిన అవసరముందని వెంకయ్య అన్నారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీని రద్దు చేయలేదని, ఆ రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలకు బీజేపీపై తప్పుడు ప్రచారం చేయొద్దని వెంకయ్య సూచించారు. బడ్జెట్ ఆమోదం పొందే అవకాశం లేకపోవడం వల్ల అక్కడ సంక్షోభం ఏర్పడిందన్నారు. అసెంబ్లీ సుప్తచేతనావస్థలో ఉందని, బలం నిరూపించుకునే అవకాశం ఇంకా ఉందన్నారు. అక్కడి పరిణామాల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యం లేదని వెంకయ్య స్పష్టం చేశారు.
బాధ్యతలు స్వీకరించిన కె.లక్ష్మణ్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా డాక్టర్ కె.లక్ష్మణ్ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. బీజేపీకి ఇప్పటిదాకా అధ్యక్షునిగా ఉన్న జి.కిషన్‌రెడ్డి నుంచి లక్ష్మణ్ బాధ్యతలను స్వీకరించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ కార్యదర్శి పి.మురళీధర్‌రావు, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. పార్టీ అగ్రనేతలంతా లక్ష్మణ్‌ను అభినందించారు.