
కుతుబ్‌షాహీ సమాధులను సందర్శించిన ఉపరాష్ట్రపతి
హైదరాబాద్: భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆదివారం గోల్కొండ కోట సమీపంలోని కుతుబ్‌షాహీ సమాధులను సందర్శించారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలసి సమాధుల సుందరీకరణ, మరమ్మతు పనులను పరిశీలించారు. ఈ పనులపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన అగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఇండియా చైర్మన్ అబద్ అహ్మద్‌ను వివరాలు, ప్రత్యేకతలు అడిగి తెలుసుకున్నారు. రాజ కుటుంబీకులకు స్నానం చేయించే హమామ్ భవనం, దాని నిర్మాణ శైలిని చూసిన అన్సారీ ఆశ్చర్యచకితులయ్యారు. దాదాపు గంటసేపు ఈ ప్రాంగణంలో అన్సారీ గడిపారు. ఆయన వెంట రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం తదితరులున్నారు.
ముగిసిన పర్యటన...
కాగా, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తన హైదరాబాద్ పర్యటన ముగించుకుని ఆదివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారి, కేంద్ర మంత్రి దత్తాత్రేయ, మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు రాష్ట్ర మంత్రులు ఆయనకు వీడ్కోలు పలికారు.