
'రెండుమూడు రోజుల్లో నిర్ణయం చెబుతా'
హైదరాబాద్: టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి కె. విజయరామారావు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. మంత్రి కేటీఆర్ శనివారం విజయరామారావును కలిసి తమ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. తనను ఆహ్వానించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. రెండుమూడు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తానని ఆయన చెప్పారు.
కాగా, విజయరామారావు కుమార్తె అన్నపూర్ణకు టీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి కేటీఆర్ హామీయిచ్చినట్టు తెలుస్తోంది. విజయరామారావు నిన్ననే టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనను బుజ్జగించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సోమవారం తర్వాత విజయరామారావు టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశముందని తెలుస్తోంది.