
మేయర్ అభ్యర్థిగా విక్రమ్: ఉత్తమ్
ఈ నెల 29, 30న ప్రచారానికి దిగ్విజయ్, ఆజాద్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ అభ్యర్థిగా ఎం.విక్రమ్ గౌడ్‌ను టీపీసీసీ అధికారికంగా ప్రకటించింది. పార్టీలోని సీనియర్లతో చర్చించి, అందరి ఆమోదం తీసుకుని విక్రమ్‌ను నిర్ణయించినట్టుగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం ప్రకటించారు. మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు, యువకుడు అయిన విక్రమ్‌ను మేయర్ అభ్యర్థిగా నిర్ణయించామన్నారు. పార్టీకి చెందిన జాతీయ నేతలు, రాష్ట్రంలో అనుభవజ్జులైన నాయకులు గ్రేటర్‌లో ఎన్నికల ప్రచారం చేస్తారని వెల్లడించారు.
రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ఈ నెల 29న, కేంద్ర మాజీమంత్రి గులాంనబీ ఆజాద్ 30న హైదరాబాద్‌లో ప్రచారంచేస్తారని వివరించారు. పాతబస్తీలో నిర్వహించే బహిరంగసభల్లో వారు ప్రసంగిస్తారని తెలిపారు. దీనితోపాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచార వ్యూహం, సమన్వయం చేయడానికి అనుభవజ్ఞులతో ప్రచార కమిటీని ఏర్పాటుచేసినట్టుగా ఉత్తమ్ వెల్లడించారు. ఏఐసీసీ కార్యదర్శి, ఎంపీ వి.హనుమంతరావు చైర్మన్‌గా ప్రచార కమిటీ ఏర్పాటైందన్నారు. పార్టీ సీనియర్లు సర్వే సత్యనారాయణ, నంది ఎల్లయ్య, ఎం.ఏ.ఖాన్, రేణుకా చౌదరి, పి.సబితా ఇంద్రారెడ్డి, ఎం.శశిధర్ రెడ్డి, జి.ప్రసాద్‌కుమార్, ఎం.అంజన్‌కుమార్ యాదవ్, పి.సుధాకర్ రెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వివరించారు.