
ఓట్ల వేటలో ఎన్ని‘రంగు’లో!
ఓట్ల వేటలో మన నేతలు ఎన్నో ‘కళ’లు ప్రదర్శిస్తున్నారు. అన్ని వర్గాలను ప్రసన్నం చేసుకోవడానికి ఎంతకైనా సిద్ధమవుతున్నారు.
♦ అపార్ట్‌మెంట్ వాసుల ఓట్ల కోసం అభ్యర్థుల పాట్లు
♦ రంగులు వేయిస్తాం..రిపేర్లు చేయిస్తామంటూ ఆఫర్లు
♦ జనరేటర్లు, లిఫ్టుల ఏర్పాటుకూ వెనుకాడని వైనం
♦ కాలనీల్లో జోరుగా సాగుతున్న వ్యవహారం
గ్రేటర్ కార్పొరేటర్లుగా మారడానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నో ఎత్తులు వేస్తున్నారు. ఏ కోణంలోనూ ‘కోడ్ ఆఫ్ కండక్ట్’కు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీటిలో భాగంగా అపార్ట్‌మెంట్స్‌లో ఉండే వారి ఓట్లను గంప గుత్తగా కొట్టేయడానికి బోలెడు ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. ‘అపార్ట్‌మెంట్లకు రంగులు వేయిస్తాం, మరమ్మతులు చేయిస్తాం, అవసరమైతే జనరేటర్లు, లిప్టులు సమకూరుస్తాం, ఆట వస్తువులు అందిస్తాం...’అంటూ హామీలు గుప్పిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో మరో అడుగు ముందుకు వేసి సరిహద్దు వివాదాలనూ పరిష్కరించడానికి సిద్ధమవుతున్నారు. -సాక్షి, సిటీబ్యూరో
ఓట్ల వేటలో మన నేతలు ఎన్నో ‘కళ’లు ప్రదర్శిస్తున్నారు. అన్ని వర్గాలను ప్రసన్నం చేసుకోవడానికి ఎంతకైనా సిద్ధమవుతున్నారు. ఇంటింటికీ తిరిగి ఓట్లు అడుగుతూనే మరోవైపు ‘కోడ్’ చాటు బేరసారాలు సాగిస్తున్నారు. అపార్ట్‌మెంట్ వాసుల ఓట్లు గంపగుత్తగా వేయించుకునేందుకు మంచి మంచి ఆఫర్లు ఇస్తున్నారు. నగర శివార్లతో పాటు నడిబొడ్డున ఉన్న అపార్ట్‌మెంట్లలో అనేకం పది..పదిహేనేళ్లకు పూర్వం నిర్మించినవే. దీంతో రంగులు వెలిసి పోవడం, అక్కడక్కడా పెచ్చులు ఊడిపోవడం సర్వసాధారణంగా మారింది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల కళ్లు వీటిపై పడ్డాయి.
తమ పరిధిలో ఉన్న వాటిలో కళావిహీనంగా తయారైన అపార్ట్‌మెంట్లను గుర్తించి, వాటి అసోసియేషన్లతో సంప్రదింపులు చేస్తున్నారు. గుత్తగా ఓట్లు వేయించే పక్షాన సదరు అపార్ట్‌మెంట్లకు మరమ్మతులు చేయించడం, రంగులు వేయించడం చేస్తామని హామీ ఇస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. అపార్ట్‌మెంట్లు కొత్తవైతే వాటిలోకి కావాల్సిన జనరేటర్లు, పిల్లలు ఆడుకునే ఉయ్యాలలు, జారుడు బల్లల ఏర్పాటు అంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఖర్చు తక్కువ... లాభమెక్కువ...
గ్రేటర్ ఎన్నికలు స్థానికమైనవి కావడంతో గెలుపోటములు నిర్ధారించే ఓట్ల సంఖ్య పదులు, వందల్లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హోరాహోరీ పోరు సాగుతున్న డివిజన్లలో అభ్యర్థులు కీలకమైన, గెలుపును నిర్దేశించే ఓట్లను కొనుగోలు చేయడం సర్వసాధారణ విషయం. ఒక్కో సందర్భంలో ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు చెల్లిస్తుంటారు. అదే అపార్ట్‌మెంట్లకు రంగులు, మరమ్మతులు అంటూ గుత్తగా బేరం ఆడుకుంటే ఖర్చు తక్కువే అవుతోందన్నది అభ్యర్థుల ఆలోచన. ఒక్కో అపార్ట్‌మెంట్‌లోనూ కనిష్టంగా 60..గరిష్టంగా 200 ఓట్ల వరకు ఉంటాయి. వీటిని కొనుగోలు చేయాలంటూ కనీసం రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది.
మరోపక్క ఈ ఆపార్ట్‌మెంట్స్‌లో నివసించే వాళ్లల్లో అత్యధికం మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వాళ్లే ఉంటారు. వీరు సాధారణంగా ఓటు కోసం నగదు తీసుకోవడానికి వెనుకాడతారు. అదే సదరు అపార్ట్‌మెంట్‌కు చిన్నచిన్న మరమ్మతులు చేయించడం, రంగులు వేయించడం చేస్తే రూ.70 వేలతో పూర్తయిపోతుంది. కేవలం అపార్ట్‌మెంట్లకు బయటపక్క మాత్రమే ఈ తంతు చేయిస్తామని అభ్యర్థులు చెబుతున్నారు.
కాంట్రాక్టుల్లోనూ ఓట్ల వేట...
ఈ రంగులు వేయడం, మరమ్మతులు చేయడంలో ముడి సరుకు సరఫరా, పనులు నిర్వహించడానికి స్థానికులకే కాంట్రాక్టులు ఇస్తున్నారు. ఇక్కడ సైతం అభ్యర్థులు ఓట్ల వేటను వదలడం లేదు. ఓ ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్ల మరమ్మతులు, రంగులకు కొందరికి కాంట్రాక్టుకు ఇస్తూ... వారితో పాటు వారి దగ్గర పని చేసే అందరి ఓట్లూ తమకే వేయించాలని షరతు పెడుతున్నారట. ఒకేసారి అనేక అపార్ట్‌మెంట్ల పని అప్పగిస్తుండటంతో పాటు డబ్బు సైతం వెంటనే చెల్లిస్తుండటంతో పనులు చేసే వాళ్లూ ఓట్లు వేయడానికి అంగీకరిస్తున్నారని తెలిసింది. ముడి సరుకు సరఫరా విషయంలోనూ అభ్యర్థులు ఇదే షరతు విధిస్తున్నారు.
సరిహద్దు వివాదాలూ పరిష్కారం...
నగర శివార్లతో పాటు అనేక ప్రాంతాల్లో ఈ ఎన్నికల మరమ్మతులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరికొన్ని చోట్ల అభ్యర్థులు ఓ అడుగు ముందుకు వేసి సరిహద్దు వివాదాలనూ పరిష్కరిస్తున్నారు. భారీ అపార్ట్‌మెంట్లు ఉన్న చోట్ల వర్షపు నీటి ప్రవాహం, పార్కింగ్, చెత్త తదితరాలకు సంబంధించి ఇరుగుపొరుగు అపార్ట్‌మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్ల వాళ్లతో వివాదాలు ఉంటున్నాయి. మరికొన్ని అడుగుల విస్తీర్ణంలో ఉన్న స్థలాల కోసమూ వివాదాలు నడుస్తున్నాయి. సదరు అపార్ట్‌మెంట్లలో భారీగా ఓట్లు ఉన్న పక్షంలో ఈ వివాదాల పరిష్కారానికీ అభ్యర్థులు ముందుకు వస్తున్నారు. అవసరమైన మొత్తం చెల్లించి వివాదాలకు కేంద్రగా ఉన్న అడుగుల విస్తీర్ణంలోని స్థలం కొనుగోలు చేసి అవసరమైన అపార్ట్‌మెంట్లకు ధారాదత్తం చేస్తామంటూ అసోసియేషన్లతో ‘బేరాలకు’ దిగుతున్నారు.
చిక్కరు దొరకరు...
ఈ తరహా ప్రలోభాల వల్ల అభ్యర్థులకు సైతం ఎలాంటి ఇబ్బందులు రావట్లేదు. సాధారణంగా డబ్బు, మద్యం, బంగారు వస్తువులు తదితరాలు పంపిణీ చేసి ఓట్లు కొనాలంటే దానిపై పోలీసులు, ఎన్నికల అధికారుల నిఘా ఉంటుంది. అదే ఈ రూపంలో ప్రలోభాలు చూపడం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎవరికీ అనుమానం రాకుండా గుత్తగా ఓట్లు కొనుగోలు చేయవచ్చన్నది అభ్యర్థుల ఆలోచన. ఇంటికి మరమ్మతులు జరిగాయనే ఉద్దేశంతో ఓట్లు కూడా కచ్చితంగా పడతాయని ఆయా అభ్యర్థులు విశ్వసిస్తున్నారు. ఏదేమైనా గ్రేటర్ ఎన్నికల పుణ్యమా అని ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని, అసోసియేషన్లు పట్టించుకోని అపార్ట్‌మెంట్లుకు కొత్తకళ వస్తోందని ‘ఫ్లాట్ వాసులు’ తృప్తిపడుతున్నారు.