ఆస్తి పన్నుపై వడ్డీ మాఫీ
జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడి
6.24 లక్షల కుటుంబాలకు ఊరట రూ. 532.57 కోట్ల మేర లబ్ధి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌వాసులకు శుభవార్త! ఆస్తి పన్నుపై వడ్డీని మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితం గా నగరంలోని 6.24లక్షల కుటుంబాలకు ఊరట లభించనుంది. తద్వారా రూ.532.57 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. నగర మేయర్ బొంతు రామ్మోహన్ సోమవారం జీహెచ్‌ఎంసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జీెహ చ్‌ఎం సీ ప్రధాన ఆదాయ మార్గాల్లో ఆస్తి పన్ను ముఖ్యమైనప్పటికీ ప్రజలకు మేలు కలిగించేందుకు ప్రభుత్వం ఈ నెల 20న ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొత్తం మీద జీహెచ్‌ఎంసీకి రూ.2,078 కోట్ల ఆస్తిపన్ను రావాల్సి ఉందన్నారు.
అందులో రూ.619.39కోట్ల బకాయిలకు రూ.474.33 కోట్లు, ప్రస్తుతం రావాల్సిన రూ.1,029.28 కోట్ల ఆస్తి పన్నులో రూ.58.24 కోట్ల వడ్డీ మాఫీ అయిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ఎవరైనా తమ ఆస్తిపన్ను వడ్డీతో సహా చెల్లిస్తే ఆ వడ్డీని వచ్చే పన్నులో మినహాయిస్తామన్నారు. జీహెచ్‌ఎంసీకి ప్రభుత్వ శాఖలు సుమారు రూ.170 కోట్లు బకాయి పడ్డాయని, వాటి వసూలు కోసం ఆయా శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీ సచివాలయం, ఇతర ప్రభుత్వ భవనాల ఆస్తి పన్నుకు సంబంధించిన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, సంబంధిత కార్యదర్శులతో సమావేశం నిర్వహిస్తామన్నారు.
నగరాభివృద్ధికి సహకరించండి
నగర అభివృద్ధి ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమని, సకాలంలో పన్నులు చెల్లించి అందుకు సహకరించాలని మేయర్ కోరారు. వడ్డీ మాఫీ చేసినందున బకాయిదారులు వెంటనే ఆస్తి పన్ను చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో ఆదివారం నిర్వహించిన ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారంలో సుమారు 707 ఫిర్యాదులు రాగా అందులో 64 అక్కడిక్కడే పరిష్కరించామన్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్థన్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్ శంకరయ్య పాల్గొన్నారు.
ఇతర పురపాలికల్లోనూ...
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆస్తిపన్నులపై ఉన్న వడ్డీని మాఫీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 20న రాష్ట్ర పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్వి ఎంజీ గోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. 2015-16 ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు ( ఈ మార్చి 31 దాకా) ఉన్న ఆస్తిపన్నుల అసలు చెల్లిస్తేనే ఈ వడ్డీ మాఫీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఎవరైనా ఆస్తిపన్ను, వడ్డీ చెల్లించి ఉంటే ఆ వడ్డీ మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన పన్నుల్లో సర్దుబాటు చేయనున్నారు.